ఇసుక మాఫియా దారుణాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇసుక మాఫియా దాటికి ఓ సాధారణ రైతు బలయ్యాడు. లారీతో తొక్కించి మరీ దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తీర్మాలపూర్‌లో ఇసుక మాఫియా బరితెగించింది. తమ పొలాల నుంచి ఇసుక లారీలను తీసుకెళ్లొద్దు.. పొలాలు ఆగమై పోతున్నాయని వేడుకున్న పాపానికి ఓ రైతు బలయ్యాడు. గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ పొలంలో నుంచి ఇసుక రవాణా చేసేందుకు యత్నించగా.. అడ్డుకునేందుకు గ్రామానికి చెందిన గుర్రం కాడి పోచయ్య(38) అనే రైతు యత్నించాడు. దీంతో పోచయ్యను ఇసుక మాఫియా లారీతో తొక్కించింది. 

కాగా.. రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన వ్యవసాయు పొలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేయవద్దని.. అసలే గత 3 సంవత్సరాలుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని పోచయ్య వేడుకున్నాడు.  అయినా కనికరం చూపకుండా హతమార్చారు. ఇసుక రవాణా వద్దని వారించిన రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని... అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక మాఫియా తమ ఆగడాలు కొనసాగుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.