కొంపముంచిన గూగుల్ మ్యూప్: గౌరవెల్లి ప్రాజెక్టులో మునిగిన లారీ
గూగుల్ మ్యాప్ సహాయంతో డ్రైవింగ్ చేస్తూ లారీని గౌరవెల్లి ప్రాజెక్టులోకి తీసుకెళ్లాడు ఓ డ్రైవర్. తాను వెళ్లాల్సిన రోడ్డు మార్గం తెలియక పోవడంతో డ్రైవర్ గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నాడు.
సిద్దిపేట: టెక్నాలజీ సహాయంతో ప్రతి పనిని సులభంగా చేసుకుంటున్నాం. కొన్ని సమయాల్లో టెక్నాలజీని నమ్ముకుంటే కొంపలు మునుగుతున్నాయి. గూగుల్ మ్యాప్ లో దారిని చూస్తూ లారీని నడిపిన డ్రైవర్ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకొన్నారు. గూగుల్ మ్యాప్ చూస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులోకి లారీ డ్రైవర్ లారీని తీసుకెళ్లాడు. చివరకు లారీ నుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
హైద్రాబాద్ నుండి హుస్నాబాద్ కు లారీని తీసుకెళ్తున్నాడు డ్రైవర్. రామవరం నుండి హుస్నాబాద్ కు వెళ్లే మార్గం తెలియదు. అతనితో పాటు ఉన్న క్లీనర్ కు కూడ ఈ మార్గం కొత్త. దీంతో తమ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ సహాయంతో హుస్నాబాద్ కు పయనమయ్యారు. నందారం స్టేజీ వద్ద రోడ్డు డైవర్షన్ ఉంది. ఈ మేరకు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లు రోడ్డు పక్కకు పడిపోయాయి.ఈ విషయాన్ని లారీ డ్రైవర్ గుర్తించలేదు. గూగుల్ మ్యాప్ ఆధారంగా అలానే లారీని ముందుకు పోనిచ్చాడు. లారీ గౌరవెళ్లి ప్రాజెక్టులోకి గూగుల్ మ్యాప్ దారి చూపింది. అలానే డ్రైవర్ లారీని ముందుకు నడిపాడు. నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి లారీ వెళ్లి నిలిచిపోయింది. లారీ డ్రైవర్, క్లీనర్ నీటి నుండి బయటకు వచ్చి స్థానికులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులు జేసీబీ సహాయంతో లారీని బయటకు తీసుకు వచ్చారు.