Revanth Reddy: హస్తినాకు సీఎం రేవంత్.. మరి ఈసారైనా ఆ సీట్లపై క్లారిటీ వస్తుందా?
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలువనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు.
CM Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలువనున్నారు. రాష్ట్రంలో ప్రచారానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రావాలని కోరనున్నారు. దీంతో పాటు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చేయాల్సిన ప్రచారంపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. అగ్రనేతలను తెలంగాణ ప్రచారానికి రావాలని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే 14 ఎంపీ స్థానాల్లో మిగిలిన 3 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భేటీలోనైనా ఈ సీట్ల విషయంలో ఓ క్లారిటీ రానున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. షెడ్యూల్ వచ్చి చాలా రోజులు అవుతున్నా.. పెండింగ్ సీట్ల విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. ప్రధానంగా ఖమ్మం, కరీంనగర్ స్థానాల అభ్యర్థుల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇబ్బందిగా మారింది.
హైదరాబాద్ సీటు విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. కరీంనగర్, ఖమ్మం విషయంలో మాత్రం సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ కీలక నేతలు తమకు కావాలంటే తమకు కావాలంటూ పట్టుబట్టడంతో రెండూ సమస్యగా తయారయ్యాయి. కరీంనగర్ సీటు విషయంలో బీసీ నేతకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక ఖమ్మం సీటు విషయానికి వస్తే.. కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలంటూ కొందరూ భావిస్తే.. మరికొందరూ రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతున్నారు. ఈ ఖమ్మంలో ప్రధానంగా భట్టి విక్రమార్క సతీమణికి కేటాయించాలని భావిస్తుండగా.. మరికొందరు మండవ వెంకటేశ్వరరావు అవకాశం కల్పించాలని మరికొందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించేశాయి. వారు ఇప్పుడు ప్రచారం కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ పర్యటనలోనైనా ఈ మూడు స్థానాలపై క్లారిటీ వస్తున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.