Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంపై దాడికి మిడతల దండు సిద్ధం: అధికారులు అప్రమత్తం!

మిడతల దండు మహారాష్ట్రను ఆనుకొని ఉన్న తెలంగాణలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. 

Locust Ready to Attack On Telangana Crops, Agriculture Officers On High Alert
Author
Hyderabad, First Published May 27, 2020, 12:26 PM IST

ఎక్కడో ఆఫ్రికా నుంచి పాకిస్తాన్ పై దాడి చేస్తూ ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్నాయి మిడతలు. ఉత్తర భారతంలోని హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పంటలను ధ్వంసం చేస్తూ ఆ మిడతలు తాజాగా మహారాష్ట్ర వరకు వచ్చాయి. 

ఈ నేపథ్యంలో ఆ మిడతల దండు మహారాష్ట్రను ఆనుకొని ఉన్న తెలంగాణలోకి ప్రవేశించే పరిస్థితులు ఉన్న దృష్ట్యా రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. 

మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతలు పంటల మీద విరుచుకుపడుతున్న దృష్ట్యా అక్కడి అధికారులు వాటి నివారణకు సమగ్ర చర్యలను తీసుకుంటున్నారని, అక్కడి అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం వెల్లడించారని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. 

అక్కడ గనుక ఆ మిడతల దండును నియంత్రించలేకపోతే..... అవి తెలంగాణమీదకు దండెత్తే ఆస్కారం కూడా లేకపోలేదని వారు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్రతో సరిహద్దును పంచుకునే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాదు జిల్లాలపై ఈ మిడతల దండు దాడి చేసే ఆస్కారం ఉన్నట్టుగా వ్యవసాయ శాఖ తెలిపింది. 

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌లలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖాధికారులు రైతులకు సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేయాలనీ వారు సలహాలిచ్చారు. 

ఇలా భారతదేశం మీద దాడి చేస్తున్న మిడతలు రోజుకు తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినేస్తుందని, వాటిలో సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా జరుగుతుందని, జూన్‌లోగా వాటి సంఖ్య వందల రెట్లు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. 

ఈ మిడతల దండు గంటకు 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అవి ఆ స్పీడ్ తో ప్రయాణిస్తూనే ఉత్తర ఆఫ్రికా నుంచి పాకిస్తాన్ మీదుగా మహారాష్ట్ర వరకు ప్రయాణించాయని వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. అవి చెట్ల మీద ఆవాసాలను ఏర్పాటు చేసుకొని పంటలపై దాడి చేస్తూ వాటిని తినేస్తున్నాయని వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios