లాక్ డౌన్ సమయంలో మద్యం కోసం... కన్నతల్లిని హత్యచేసిన కసాయి కొడుకు
లాక్ డౌన్ సమయంలో మద్యం కోసం ఏకంగా కన్నతల్లినే హత్య చేశాడు ఓ తాగుబోతు.
కరీంనగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ తాగుబోతు. ఈ దారుణ సంఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వివరాల ప్రకారం మహాముత్తారం మండలం యామన్‌పల్లికి చెందిన మధుకర్ మద్యానికి బానిస అయ్యాడు. పనీ పాట లేకుండా ఫీకలదాక మద్యం తాగి గ్రామంలోనే జులాయిగా తిరుగుతుండేవాడు. అతడికి వున్న దురలవాట్లతో ఏ పనీ చేయకుండా నిత్యం వేదిస్తుండటంతో విసుగు చెంది మొదటి భార్య విడాకులు ఇచ్చింది. అయితే తల్లి అతడికి రెండో పెండ్లి చేసినా ఎలాంటి మార్పు రాలేదు. దీంతో రెండో భార్య కూడా విడిచిపెట్టి వెళ్లిపోయింది.
ఇద్దరు భార్యలకు దూరమైనప్పటి నుంచి తల్లి రాజమ్మతో పాటే ఉంటున్నాడు మధుకర్. అయితే లాక్ డౌన్ కారణంగా మద్యం లభించకపోవడంతో అతడు మరింత వింతగా ప్రవర్తించేవాడు. గురువారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని తల్లిని మధుకర్ అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో క్షణికావేశంతో రోకలితో రాజమ్మ తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాజవ్వ మృతదేహాన్ని పరిశీలించారు. ప్రస్తుతం పరారీలో వున్న ఆమె తాగుబోతు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు.