మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. కరోనా సోకిన వారి ప్రాణాలు కాపాడేందుకు వైదులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అలాంటి వారికి ఎన్నిసార్లు దన్యవాదాలు చెప్పినా తప్పులేదు. కాగా.. తాజాగా ఓ వైద్యురాలికి అద్వితీయ స్వాగతం లభించింది.  ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే...గత రెండు వారాలుగా గాంధీలోని కరోనా బాధితులకు వైద్యం అదిస్తున్న డాక్టర్‌ విజయశ్రీకి ఆమె నివాసం  ఉంటున్న వీధి ప్రజలు అపార్టమెంట్‌లో నిలబడి ఘన స్వాగతం పలికారు. రెండు వారాల తరువాత ఆమె ఇంటికి చేరుకోగా.. హర్షధ్వానాలతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. దీంతో డాక్టర్‌ విజయశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. వైద్యురాలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఇలాంటి వీడియోని ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సమాజం అండగా నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు.