హైదరాబాద్ లో అమానుష ఘటన జరిగింది. ఓ యువతిని ప్రేమించిన యువకుడు వేధింపులకు గురి చేయడమే కాకుండా.. కిడ్నాప్ కు యత్నించాడు. ఆ ప్రయత్నంనుంచి అతి కష్టంగా బయటపడ్డ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళితే చావ వినయ్ చౌదరి అనే యువకుడు  కొంత కాలం క్రితం బాధిత యువతితో సహజీవనం చేశాడు. కొద్దికాలం బాగానే సాగినా, ఆ తరువాత  ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు.

కాగా.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈనెల 16వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు వినయ్ చౌదరి అక్రమంగా బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు.  ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె ఫోను పగలగొట్టాడు. అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడు.

అంతటితో ఆగకుండా ఆమెను బలవంతంగా ఇంట్లోంచి బయటికి ఈడ్చుకు వచ్చాడు. బయట సిద్ధంగా ఉన్న కారులోకి తోసి, కిడ్నాప్ కు యత్నం చేశాడు. అప్పటికే ప్రమాదం గ్రహించిన ఆ యువతని కేకలు వేయడంతో, ఆమె ఇంటి యజమాని తో పాటు చుట్టుపక్కల వారు బయటికి వచ్చారు.

నిందితుడిని అడ్డుకున్నారు. బాధితురాలిని కాపాడారు. అయితే నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా..  వినయ్ చౌదరి వారికి దొరకకుండా అక్కడినుంచి ఉడాయించాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోలీసులు వినయ్ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 448, 354, 427, 506 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.