మద్యం ప్రియులకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. హోలీ పండగ నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు.
మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. హోలీ పండగ వేళ మద్యం ఆంక్షలు విధించనున్నారు. పండగ నేపథ్యంలో నగరంలో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగర పీఎస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు మద్యంపై ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
అంటే..హోలీ సందర్భంగా మార్చి 6 (సోమవారం) సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ (బుధవారం) ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్ లు మూసివేస్తారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ప్రకటన విడుదల చేశారు. అలాగే.. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. చట్టపరంగా కఠిన చర్యలుంటామని, బహిరంగ ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతల కారణంగా హోలీ పండగ వేళ మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
బోనాలు, హోలీ వంటి పండగల సందర్భాల్లో నగరంలో మద్యం షాపులను మూసివేస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, గుంపులు గుంపులు తిరుగుతూ.. ఇతరులను ఇబ్బందులకు గురి చేయరాదని సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అని తెలియడంతో మందుబాబులు వైన్స్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో వైన్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి.
