తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్ల రానున్నాయి.దీంతో మద్యం,బీర్ల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
తెలంగాణలో మద్యం వినియోగదారులకు త్వరలో ఊరట కలిగే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ వర్గాలు, అధికార వర్గాల అంచనాల ప్రకారం మద్యం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం రాష్ట్ర మద్యం మార్కెట్‌లో కొత్త బ్రాండ్ల ప్రవేశం పెరగడమే.
తాజాగా తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ (TGBCL) విడుదల చేసిన నోటిఫికేషన్‌కు భారీ స్పందన రావడంతో 92 కంపెనీలు మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపాయి. ఇందులో 331 బ్రాండ్లు దేశీయవైనా, 273 విదేశీ బ్రాండ్లు కావడం విశేషం. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 45 కంపెనీలతో పాటు, 47 కొత్త కంపెనీలు కూడా రంగంలోకి దిగడం పోటీని పెంచుతోంది.
ధరలు కూడా తక్కువయ్యే…
ఈ పోటీ వల్ల వినియోగదారులకు మద్యం ఎంపికలు పెరగడమే కాకుండా, ధరలు కూడా కాస్త తక్కువయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బీర్ సరఫరాలో గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL)తో చర్చలు జరిపింది. రూ.658 కోట్ల బకాయిల సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టిన తరువాత కింగ్‌ఫిషర్, హైనెకెన్ వంటి బ్రాండ్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.
ప్రస్తుతం రాష్ట్రానికి మద్యం అమ్మకాలు ముఖ్య ఆదాయ వనరుగా మారాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ రూ.34,600 కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడు కొత్త బ్రాండ్ల రాకతో వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు, కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతుంది. దీనివల్ల మార్కెట్ స్థిరపడడమే కాక, ధరలు తగ్గే అవకాశం కూడా ఏర్పడుతోంది.
10 రోజుల వ్యవధి…
అంతేకాకుండా, దరఖాస్తుల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ, ప్రజాభిప్రాయాల కోసం 10 రోజుల వ్యవధి ఇవ్వడం కూడా పారదర్శకతకు దోహదం చేస్తోంది. కమిటీ సూచనల ఆధారంగా ధరల సవరణపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.