బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని తాము ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ తెలిపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిర్వహించనున్న దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. జంతర్‌మంతర్ వేదిక వద్ద నుంచి తాము దీక్షను ఉపసంహరించుకుని మరోచోటికి మార్చుకుంటున్నట్లు బీజేపీ తెలిపింది. ఈ మేరకు దీన్ దయాళ్ మార్గ్‌లో తాము ధర్నా చేస్తామని ఢిల్లీ పోలీసులకు బీజేపీ సమాచారం అందించింది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. మహిళా రిజర్వేషనపై మార్చి 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జంతర్ మంతర్ వద్ద దీక్ష వేదికకు సంబంధించి పలు షరతులు విధిస్తూ ఢిల్లీ పోలీసులు కవిత సిబ్బందికి సూచించారు. ఈ రోజు కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులు ఈ విషయంపై కవితకు పేపర్ మీద రాసి సమాచారం చేరవేశారు. దీనిపై స్పందించిన కవిత.. తాము ముందుగానే దీక్షకు అనుమతి తీసుకున్నామని చెప్పారు. ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు ఈ విధంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ దీక్షలో ఎలాంటి మార్పు లేదని.. జంతర్ మంతర్ వద్ద దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also REad: జంతర్ మంతర్ వద్ద దీక్షకు పోలీసుల షరతులు!.. వెనక్కి తగ్గేది లేదంటున్న కవిత..
మీడియా సమావేశం అనంతరం కవిత నేరుగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. అక్కడ దీక్షకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జంతర్ మంతర్ వద్ద సగం స్థలం మాత్రమే వాడుకోవాలని ఢిల్లీ పోలీసులు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని కవిత కూడా మీడియాకు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ.. 5 వేల మంది వస్తారని చెప్పి.. 10 రోజుల కిందటే పర్మిషన్ కోసం ఆప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందన్నారు. అందుకు అనుమతి కూడా ఇచ్చారని చెప్పారు.
కానీ ఇప్పుడు ఇక్కడే బీజేపీ వాళ్లది కూడా ధర్నా ఉందని చెబుతున్నారని తెలిపారు. తమ వాళ్లు పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ముందుగా ఇచ్చిన పర్మిషన్ మేరకు తమ కార్యక్రమం నిర్వహించుకునేలా చూడాలని కోరారు. పర్మిషన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించుకోవాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభం కావాల్సి ఉందని అన్నారు. అయితే కొంత ఇబ్బందులకు గురిచేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పారు. మరికాసేపట్లోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని.. ఆ తర్వాత స్పందిస్తామని పేర్కొన్నారు.
