హైదరాబాద్: కూతురిని కట్టడి చేసేందుకు జుట్టు కట్ చేసి ఇంటి నుండి బయటకు రాకుండా అడ్డుకోవడంతో మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన హైద్రాబాద్ లో  చోటు చేసుకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

హైద్రాబాద్ నగరంలోని మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్  పరిధిలోని లక్ష్మీగూడలో పరమేశ్వర్ కుటుంబం నివాసం ఉంటుంది. పరమేశ్వర్ 20 ఏళ్ల క్రితం ఒడిశా నుండి వలస వచ్చాడు. ఆయనకు నలుగురు సంతానం . పరమేశ్వర్ చిన్న కూతురు లీజా. ఆమె వయస్సు 20 ఏళ్లు. పరమేశ్వర్ ఇంటికి సమీపంలోనే అప్పర్ అలియాస్ అక్రం నివాసం ఉంటున్నారు.

వీరిద్దరూ కూడ ఒకే కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో మాట్లాడుకొనేవారు.ఈ పరిచయం వీరిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.ఈ విషయం లీజా కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో లీజా కుటుంబసభ్యులు అప్సర్ ను హెచ్చరించారు.

ఈ ప్రేమకు చెక్ పెట్టేందుకు గాను లీజా జుట్టును కట్ చేసి బయటకు వెళ్లనీయకుండా ఇంట్లోనే ఉంచారు. దీంతో మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడు అఫ్సర్ తరచూ ఫోన్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ వేధింపులు తట్టుకోలేక  సోమవారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అఫ్సర్ తో ఆమె గంటపాటు ఫోన్ లో మాట్లాడింది. ఆమె చనిపోయిన తర్వాత కూడ 135 ఫోన్ కాల్స్ అఫ్సర్ నుండి వచ్చినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.