హైదరాబాద్: రాబోయే మూడు నెలల్లోనే తెలుగుభాష నేర్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్. తెలుగు భాష నేర్చుకుని ప్రజల్లో మరింత మమేకమవుతానని ఆమె చెప్పుకొచ్చారు. 

జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సౌందరరాజన్. మహిళలు ప్రతీ రంగాన్ని సవాల్ గా తీసుకుని  ముందుకు వెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. 

ప్రతీ మహిళ తనకు ఇష్టమైన ఒక రంగాన్ని ఎంచుకుని అందులో నైపుణ్యం సాధించాలని సూచించారు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం కూడా మహిళలకు ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు. 

ప్రతీమహిళా ఆరోగ్యంపై శ్రద్ధచూపాలని తమిళసై సౌందరరాజన్ సూచించారు. మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న మహిళలు త్వరగా తమ జీవితాల్లో సెటిల్ అవ్వాలని సూచించారు. 

నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న మహిళలు ముద్ర లోన్ లు తీసుకోవచ్చునని స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. అలాగే మిగిలిన మహిళలు కూడా శిక్షణ తీసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమవుతానని లక్ష్మణ్ స్పష్టం చేశారు. 

అనంతరం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తో కలిసి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ శిక్షణ పొందిన మహిళలలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఎంపికైన మహిళలను ఇరువురు అభినందించారు. 

తమిళసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్. అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ కూడా. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారు. రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించింది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 

అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కీలక నిర్ణయాలు ప్రకటించారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ప్రకటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు అది ప్రారంభించలేదు. 

ఇకపోతే త్వరలోనే తెలంగాణలో ఏజెన్సీబాట పట్టనున్నారు. ఇటీవలే గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన ఆమె గిరిజనులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. త్వరలోనే తాను గిరిజన తండాల్లో పర్యటిస్తానని ఒక రోజు బస చేస్తానని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రానికి నివేదిక సమర్పించిన సంగతి కూడా తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి

ఇక తండాల్లోకి తమిళిసై: ఇప్పటికే ఆర్టీసీ, కేసీఆర్ కు మరో చిక్కు