పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. హైకోర్టు న్యాయవాది దంపతులను దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. వివరాల్లోకి వెళితే.. రామగిరి మండలం కల్వచర్ల సమీపంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన హై కోర్ట్ న్యాయవాది గట్టు వామన్‌రావుపై దుండగులు కత్తులతో దాడి చేశారు.

భర్తను కాపాడేందుకు వెళ్ళిన ఆయన భార్య నాగమణిపైనా దుండుగులు దాడి చేయడంతో ఆమె కూడా మరణించారు. గత కొంతకాలం నుంచి వామన్‌రావు పలు వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. మంథని నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. 

మంథనికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, ఆ పార్టీ నేతలే తనను హత్య చేశారని వామన్‌రావు మరణించే ముందు చివరి వాంగ్మూలం ఇచ్చారు. సెటిల్‌మెంట్లు, ల్యాండ్‌కు సంబంధించిన వివాదాలే హత్యకు దారి తీసినట్లుగా భావిస్తున్నారు.

కొన ఊపిరితో వున్న వామన్ రావు దంపతులను స్థానికులు ఆసుపత్రికి తరిలిస్తుండగా మార్గమధ్యంలోనే వారు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తిపై అనుమానాలు రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.