తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెద్దపల్లి లాయర్ హత్య కేసులో సుఫారీ గ్యాంగ్‌ల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను రంగంలోకి దించినట్లుగా కమీషనర్ సత్యనారాయణ తెలిపారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పెద్దపల్లి లాయర్ హత్య కేసులో సుఫారీ గ్యాంగ్‌ల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను రంగంలోకి దించినట్లుగా కమీషనర్ సత్యనారాయణ తెలిపారు.
నిందితులను ఎంతటి వారైనా వదిలేది లేదని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. అటాక్ జరిగిన తర్వాత కుంట శ్రీనుపై అనుమానాలు వస్తున్నాయని.. వీరిద్దరికి గతంలో ఓ దేవాలయానికి సంబంధించిన వివాదం వుందని సీపీ చెప్పారు. కుంట శ్రీను పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఆ కోణంలో సైతం తాము దర్యాప్తు చేస్తున్నట్లు కమీషనర్ వెల్లడించారు. అతనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సత్యనారాయణ తెలిపారు.
వామన్‌రావుకు గడిచిన కొద్దిరోజుల నుంచి ఫోన్లు చేస్తున్న వారి కాల్ డేటాను సేకరిస్తున్నామని.. దీనిని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం వుందని సీపీ అభిప్రాయపడ్డారు. కుంట శ్రీనుకు సంబంధించిన ఓ కేసులో ఈరోజు కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడానికి వామన్‌రావు వెళ్లినట్లుగా సత్యనారాయణ చెబుతున్నారు.
గుడి భూమి వివాదంలో కుంట శ్రీనుకు, వామన్ రావుకు మధ్య గొడవలున్నట్లు ఆయన తెలిపారు. కుంట శ్రీను పేరును వామన్ రావు ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. దాడి జరిగిన తర్వాత రోడ్డుపై పడి కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ వామన్ రావు మాట్లాడడం కనిపించింది.
