దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారన్నారు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గాల్వన్ వ్యాలీ ఘటనలో చైనా సైనికుల దాడిని వీరోచితంగా తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషిని కలెక్టర్‌ సన్మానించారు.

ఈ సందర్భంగా సంతోషి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తన భర్త సంతోష్‌బాబుకు అవార్డు ప్రకటించటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:కల్నల్ సంతోష్ బాబు: మహావీర్ చక్ర ప్రకటించిన కేంద్రం

మీడియాతో మాట్లాడుతున్న సమయంలో సంతోషి భావోద్వేగానికి గురయ్యారు. గతేడాది జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికుల కుట్రలను తిప్పికొట్టడంతో కల్నల్ సంతోష్ బాబు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.

చివరి శ్వాస వరకు శత్రువులతో వీరోచితంగా పోరాడుతూ తోటి సైనికుల్లో స్ఫూర్తి నింపారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌తో పాటు మొత్తం 20 మంది సైనికులు వీరమరణం పొందారు.