హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది దాకా స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించి ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సంచలనం సృష్టించారు. స్వతంత్ర అభ్యర్థులనే పదానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దొరక్క రెబెల్స్ గా, బిఎల్ఎఫ్, బిఎస్పీ వంటి పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారనేది ఆయన వివరణ. 

2004, 2009, 2014 ఎన్నికల్లో ఆయన నిర్వహించి, వెల్లడించిన ఫలితాలు తుది ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఆయన సర్వేలపై విశ్వసనీయత పెరిగింది. ప్రభుత్వ అనుకూల పవనాలు లేకపోవడం, పోటీకి దిగిన స్వతంత్ర అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండడం, బలమైన రెబెల్స్ కావడం వంటి కారణాల వల్ల స్వతంత్రులు విజయం సాధించే అవకాశాలున్నట్లు భావించవచ్చు. 

లగడపాటి రాజగోపాల్ విజయం సాధించే ఇద్దరు స్వతంత్రుల పేర్లు కూడా ప్రకటించారు.  నారాయణపేట నుంచి డికె శివకుమార్ రెడ్డి, బోథ్ లో అనిల్ కుమార్ జాదవ్ విజయం సాధిస్తారని ఆయన చెప్పారు 

లగడపాటి రాజగోపాల్ బహుశా గెలుస్తారని భావిస్తున్న మిగతా ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు వీరు కావచ్చునని చర్చ సాగుతోంది.

1. మల్ రెడ్డి రంగా రెడ్డి - ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దాంతో మల్ రెడ్డి రంగారెడ్డికి టికెట్ లభించలేదు. అయినా ఆయన బరిలోకి దిగారు. 

2. బోడ జనార్దన్ - చెన్నూరు నుంచి పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే, పొత్తులో భాగంగా చెన్నూరు టికెట్ టీడీపికి దక్కింది. దీంతో బోడ జనార్దన్ బిఎస్పీ అభ్యర్థిగా పోటీకి దిగారు. 

3. గడ్డం వినోద్ - బెల్లంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ తెలంగాణ నేత జి. వెంకటస్వామి కుమారుడు. వీ6 చానెల్ యజమానికి వివేక్ సోదరుడు. టీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో ఆయన బిఎస్పీ నుంచి పోటీకి దిగారు. ఆయనను పార్టీ నుంటి టీఆర్ఎస్ నాయకత్వం సస్పెండ్ చేసింది. 

4. రాములు నాయక్ - వైరా నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు రెబెల్. ఈ సీటును కాంగ్రెసు సిపిఐకి కేటాయించింది. తనకు టికెట్ లభించకపోవడంతో రాములు నాయక్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. 

5. నవీన్ యాదవ్ - జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. మజ్లీస్ తిరుగుబాటు అభ్యర్థి. గత ఎన్నికల్లో ఆయన కొద్ది పాటి తేడాతో ఓటమి పాలయ్యారు. 

6. కాట రాంబాబు - మథిర నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి. బిఎల్ఎఫ్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. సిపిఎంకు బలమైన క్యాడర్ ఉండడం, టీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఉపయోగపడడం వంటి కారణాల వల్ల ఆయన విజయం సాధించే అవకాశాలున్నాయి. 

7. యడవల్లి కృష్ణ - కొత్తకూడెం నుంచి బిఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెసు తిరుగుబాటు అభ్యర్థి. వనమా వెంకటేశ్వర రావుకు టికెట్ ఇచ్చి కాంగ్రెసు నాయకత్వం ఆయనకు నిరాకరించింది. 

8. కోరుకంటి చందర్ - రామగుండం నుంచి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి. 

మేడ్చెల్ నుంచి నక్కా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబెల్), ఖైరతాబాద్ నుంచి మన్నె గోవర్ధన్ (టీఆర్ఎస్ రెబెల్), నిజామాబాద్ అర్బన్ నుంచి రత్నాకర్ (కాంగ్రెసు రెబెల్) కూడా బలమైన స్వతంత్ర అభ్యర్థులే. 

గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, వారి బలాబలాలను, ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసి పై అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

తెలంగాణలో హంగ్ ముచ్చటే లేదు: లగడపాటి సంచలనం

కేసీఆర్ సన్నాసి అన్నది నన్ను కాదు, నాపేరు ఎక్కడా అనలేదు:లగడపాటి

నేను చెప్పిన స్వతంత్రుల అంశం నిజమే:లగడపాటి

లగడపాటివి వెకిలి సర్వేలు, ప్రజలు ఆగం కావొద్దు:కేసీఆర్

తెలంగాణలో స్వతంత్రులే కింగ్‌మేకర్లు: లగడపాటి సంచలన సర్వే