కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను కేంద్రం తుంగలో తొక్కుతుందని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని, పౌరుల హక్కులను కేంద్రం తుంగలో తొక్కుతుందని విమర్శించారు. దేశంలో ఎన్నడూలేనంతగా అసమానతలు పెరిగిపోయాయని అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రధాని నరేంద్ర మోదీ అని సంచలన ఆరోపణలు చేశారు. అదానీ వ్యవహారంలో రూ. 12 లక్షల కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు.
దేశంలో అవినీతి లేని బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక అవినీతి ఆరోపణలు వస్తే ఒక్క కేసు అయినా పెట్టారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీకి 15 నుంచి 20 సీట్లే మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. దేశాన్ని రక్షించుకునేందుకు బీజేపీ హఠావో దేశ్ కో బచావో నినాదంతో ప్రజల వద్దకు వెళ్లనున్నట్టుగా చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంలో స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. కవిత విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
