దేశవ్యాప్తంగా రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా నిన్నటితో ముగిసింది. నేటి నుండి మూడవ దఫా లాక్ డౌన్ ఉన్నప్పటికీ.... భారీ స్థాయిలో లాక్ డౌన్ మినహాయింపులు దక్కాయని చెప్పక తప్పదు. మద్యం షాపులను కూడా అనుమతించారు. 

ఇకపోతే... కరోనా వైరస్ కేసులు మాత్రం పూర్తి లాక్ డౌన్ విధించినా సున్నాను చేరుకునే ఆస్కారం మాత్రం లేదని గుర్తించిన కేంద్రం ఆ వైరస్ తోపాటు సహజీవనం చేయకతప్పదనే  నిశ్చయానికి వచ్చింది. 

ఆ విషయం ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అన్ని పేరు మోసిన పరిశోధనా సంస్థల వరకు చెబుతున్నారు. కరోనా వైరస్ కి ఒక పూర్తిస్థాయి వాక్సిన్ వచ్చెనంతవరకు ఈ ముప్పు అలాగే పొంచి ఉంటుందని, భౌతిక దూరాన్ని పాటించడం వ్యక్తిగత శుభ్రత ను పాటించడం మాత్రమే శ్రీరామ రక్షలని ప్రపంచంలోని మేటి వైద్యులు సూచిస్తున్నారు. 

ఇక ఇదే విషయాన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి వెలువడ్డప్పుడు అది అనుభవరాహిత్యమని ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇక తాజాగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ప్రజలు ఈ కరోనా వైరస్ తో జీవించడం ఎలాగో నేర్చుకోవాలని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. 

వాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందున అప్పటివరకు ఇలా బ్రతకడం తప్పదని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలన్నిటికి... కరోనా వైరస్ కట్టడిలో భారత్ ఆదర్శంగా నిలిచిందని, భారతదేశంలో లాక్ డౌన్ విధించిన తీరు సమయం అన్ని కూడా దేశంలో కరోనా వైరస్ కట్టడికి చాలా బాగాక్ పనిచేశాయని ఆయన గుర్తు చేసారు. 

గత 24 గంటల్లో 2553 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కి చేరుకొందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24 గంటల్లో 1,074 మంది కరోనా నుండి కోలుకొన్నారని  కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. 

సోమవారం నాడు న్యూఢిల్లీలో ఆయన  మీడియాతో మాట్లాడారు. గత 24 గంటల్లో  కరోనాతో 73 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 1373 మంది మరణించారని లవ్ అగర్వాల్ చెప్పారు.దేశంలో కరోనా సోకిన రోగుల రికవరీ రేటు  27.52కు పెరిగిందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29,453గా ఉందని కేంద్రం తెలిపింది. బెంగాల్ లో అధికంగా ఈ వైరస్ కారణంగా మరణించారని ఆయన తెలిపారు.

జోన్ల వారీగా లాక్ డౌన్ ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెడ్ జోన్లు,కంటైన్మెంట్లలో ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది.  ఒకరు నిర్వహించుకొనే వ్యాపారసంస్థలను తెరుచుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.ఆంక్షలను సడలించిన ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ ను పాటించకపోతే  కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలోని 112 జిల్లాల్లో 610 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి జాతీయ స్థాయి సగటు కంటే 2 శాతం తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో ఏప్రిల్ 21 తర్వాత మొదటి కేసులు నమోదైనట్టుగా ఆరోగ్య శాఖ ప్రకటించింది.