చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోదీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్‌లో పవర్ హాలిడే ప్రకటించడంపై బీజేపీపై సెటైర్లు వేశారు.
చమురు ధరల పెంపు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ధరల పెంపుపై ప్రధాని మోదీని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. గుజరాత్‌లో పవర్ హాలిడే ప్రకటించడంపై బీజేపీపై సెటైర్లు వేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రో ధరలపై అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ, బీజపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేసిన ట్వీట్స్ స్క్రీన్ షాట్స్‌ను కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అప్పుడు పెట్రో ధరల పెంపుపై కేంద్రం విఫలం అన్న మోదీ.. ఇప్పుడెందుకు పెట్రో ధరలను పెంచుతున్నారని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం.. రాష్ట్రాలపై భారం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి.. అధికార అహంకారం.. పేదల అవసరాల పట్ల సానుభూతి లేనిది.. ఇవన్నీ మోదీ గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్స్ అని ట్వీట్ చేశారు.
జల జీవన్ మిషన్ ద్వారా 2019 నుంచి మూడేళ్లలో తెలంగాణలో 38 లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు ప్రధాని మోదీ ప్రకటనపై స్పందించిన కేటీఆర్.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథకు కేంద్రం నుంచి అందిన సహకారం సున్న అని చెప్పారు. సహకారం అందించకుండా ప్రచారం చేసుకోవడం ప్రధానమంత్రి స్థాయికి తగదని పేర్కొన్నారు.
ఇక, గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడాన్ని కేటీఆర్ విమర్శించారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడే ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ఇది డబుల్ ఇంజినా లేక ట్రబుల్ ఇంజినా అని ఎద్దేవా చేశారు.
