హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకొనేందుకు బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

శుక్రవారం నాడు మున్నూరు కాపు  ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతీయులకు చెందిన నల్లధనం విదేశీ బ్యాంకుల నుండి తెప్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.  కరోనా సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ రూ. 20 లక్షలతో ఏ ఒక్కరికైనా ప్రయోజనం కలిగిందా అని ఆయన అడిగారు.

సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బీజేపీ నేతలు, సమాధులు కూలగొడుతామని ఎంఐఎం నేతలు చేసిన కామెంట్స్ ను ఆయన ప్రస్తావించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు పోయాయి.. కొత్తగా ఉద్యోగాలు రాలేదని కేటీఆర్ చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్ముతోందన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

హైద్రాబాద్  అభివృృద్దికి ఆరేళ్లుగా తమ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా పనిచేస్తోందన్నారు.