బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ఇంకా ఎన్ని అబద్దాలు చెబుతారు సార్?’’ అంటూ ప్రశ్నించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 22,500 మంది భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని జేపీ నడ్డా పేర్కొన్నట్టుగా వచ్చిన వార్త కథనంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చసిన కేటీఆర్.. బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదాన్ని కూడా మోదీ పరిష్కరించలేకపోయారని.. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారనేది అవాస్తవమని వాళ్ల నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే చెప్పిందని అన్నారు. ‘‘ఇంకా ఎన్ని అబద్దాలు చెబుతారు సార్?’’ అంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత కాల్పుల విరమణను అమలు చేస్తూ 22,500 మందికి పైగా విద్యార్థులను తరలించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను సంఘర్షణ ప్రాంతం నుంచి రక్షించినట్లు మరే ఇతర ప్రధానమంత్రి చేయలేదని అన్నారు. ‘‘భారతదేశ చరిత్రలో మోదీజీ అంత గొప్ప ప్రధాని మరొకరు లేరు. 22,500 మంది విద్యార్థులను అక్కడి నుంచి భారత్‌కు తరలించేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఆపారు’’ అని నడ్డా చెప్పారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రక్షించబడిన చాలా మంది విద్యార్థులు కర్ణాటకకు చెందినవారని జేపీ నడ్డా అన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భారతదేశంలాగా కోవిడ్ -19 వ్యాక్సిన్ టీకాలు పూర్తిగా వేయలేదని.. అందుకే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ముసుగు ధరించమని బలవంతం చేశారని నడ్డా పేర్కొన్నారు.
