Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 100 సీట్లు.. రికార్డు సృష్టించనున్న కేసీఆర్..: కేటీఆర్

తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని  మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన తొలి దక్షిణ భారత సీఎంగా రికార్డు సృష్టిస్తారని అన్నారు.

KTR Says BRS will win 90 to 100 seats in Telangana next Assembly elections ksm
Author
First Published Apr 27, 2023, 12:13 PM IST | Last Updated Apr 27, 2023, 12:13 PM IST

తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కైవసం చేసుకుంటుందని  మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన తొలి దక్షిణ భారత సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నేటితో 23వ వసంతంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా పేరు మారిన జరుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్సవం ఇదే. ఇక, ఈ ఏడాది చివరిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను మీడియా  చిట్ చాట్‌లో కేటీఆర్ వెల్లడించారు.

పార్టీ పేరులో మార్పు వచ్చినా.. పార్టీ డిఎన్‌ఏ, అజెజెండా, పార్టీ గుర్తు, తత్వం, నాయకుడు మారలేదని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం  చేశారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని.. కాంగ్రెస్, బీజేపీలు కూడా వారి వారి ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలని అన్నారు. తద్వారా ప్రజలు విశ్లేషించి నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని  అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానానికి కూడా దూరం అవుతుందని.. బీజేపీ 100 సీట్లలో డిపాజిట్లు కోల్పోతుందని జోస్యం చెప్పారు. 

Also Read: బీజేపీకి, ఇతర పార్టీలకు ఉన్న తేడా ఇదే.. : కర్ణాటక బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ

మరోమారు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. తమ నాయకుడు కేసీఆర్‌కు 70 ఏళ్లు నిండలేదని చెప్పారు. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇప్పుడు 80 ఏళ్లు అని.. ఆయన మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటున్నారని గుర్తుచేశారు. తమ నాయకుడు కేసీఆర్ ఎందుకు రిటైర్ అవ్వాలని ప్రశ్నించారు. తమకు కేసీఆరే గుర్తింపు అని అన్నారు. 

Also Read: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.. వివరాలు ఇవే..

బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో గానీ బీజేపీతో గానీ పొత్తు పెట్టుకోదని కేటీఆర్ స్పష్టం  చేశారు. ఈ రెండు పార్టీలకు బీఆర్ఎస్ సమాన దూరంలో ఉంటుందని వెల్లడించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో రెండు పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు. 
 

ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా మూడుసార్లు కొనసాగితే యావత్ దేశం గమనిస్తుందని అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేస్తారని.. అది ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే చెప్పగలదని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. ఈ మోడల్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు మహారాష్ట్రను తొలుతు ఎంచుకున్నామని.. అక్కడ విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ త్వరలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించనుందని వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios