నేనేమీ వ్యాఖ్యానించను:గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై తమిళిసై సౌందర రాజన్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు కేసీఆర్ సర్కార్ పంపిన ఇద్దరి పేర్లను తిరస్కరించడంపై వ్యాఖ్యానించేందుకు తమిళిసై సౌందర రాజన్ నిరాకరించారు.
విజయవాడ: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు కేసీఆర్ సర్కార్ పంపిన ఇద్దరి పేర్లను తిరస్కరించడంపై స్పందించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిరాకరించారు.సోమవారంనాడు రాత్రి విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసిన పేర్లను ఎందుకు తిరస్కరించానో లేఖలో వివరించినట్టుగా తమిళిసై సౌందరరాజన్ చెప్పారు.ఇద్దరి అభ్యర్థిత్వాలను ఎందుకు తిరస్కరించానో లేఖలో స్పష్టంగా చెప్పినట్టుగా ఆమె గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించే వ్యక్తిని కాదన్నారు. మళ్లీ ఈ విషయాలపై మాట్లాడలేనన్నారు.
దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీ పదవులకు కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసింది. అయితే ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు.ఈ మేరకు ఈ నెల 19న లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేఖ పంపారు.
ఈ ఏడాది జూలై 31న నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు సిఫారసు చేసింది కేబినెట్. సామాజిక సేవ కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ప్రభుత్వం కోరింది. అయితే వీరిద్దరూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ సామాజిక సేవ విషయమై ఎలాంటి కార్యక్రమాలు లేవని గవర్నర్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా గవర్నర్ కోటా కింద ఈ ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కుదరని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తేల్చి చెప్పారు.
2021 లో కూడ పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ కేబినెట్ సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును కూడ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేశారు కేసీఆర్.ఇద్దరు అభ్యర్ధిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.గవర్నర్ ఓ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ తీరుపై ఒంటికాలిపై విమర్శలు చేస్తున్నారు.