తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలు, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన ప్రజలతో పంచుకుంటూ వుంటారు. అంతేకాదు ఎవ‌రైనా ఆప‌ద‌లో లేదా ఏదైనా స‌మ‌స్య ఉండి ట్విట్ట‌ర్ ద్వారా సాయం అర్థిస్తే.. వారికి సమస్యను పరిష్కరించడంతో పాటు అండ‌గా నిల‌బ‌డ‌తారు. #ASK KTR పేరుతో నెటిజ‌న్ల‌తో ఇంట్రాక్ట్ అవుతూ.. వారి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తూ ఉంటారు.

Also Read:నోటీసులు బేఖాతరు: విరించి ఆసుపత్రిపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర.. ఆంక్షలు విధింపు

ప్ర‌స్తుత క‌రోనా స‌మ‌యంలోనే చాలా మంది త‌మ ఇబ్బందుల‌ను ఏక‌రవు పెడుతూ ట్విట్ట‌ర్ ద్వారా కేటీఆర్‌కు తెలియజేస్తున్నారు. వీరిలో చాలామందికి మంత్రి స‌మాధానాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నెటిజ‌న్ కేటీఆర్‌ ముందు ఓ వెరైటీ సమస్యను పెట్టాడు. త‌న‌కు బిర్యానీ ఆర్డ‌ర్ స‌రిగా ఇవ్వ‌లేదంటూ అత‌డు ఓ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ట్యాగ్ చేశాడు. దీనికి మంత్రి కూడా అదిరిపోయే కౌంటరిచ్చారు.

‘‘తాను చికెన్ బిర్యానీ, ఎక్స్‌ట్రా మ‌సాలా, లెగ్ పీస్ కావాలంటూ ఆర్డ‌ర్ చేశాను. కానీ వాటిలో ఏమీ రాలేదు. ప్రజలకు సేవ చేసే విధానం ఇదేనా’ అంటూ తోటకూరి రఘుపతి అనే వ్యక్తి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. 

దీనిపై స్పందించిన మంత్రి.. ‘‘దీనికి నన్ను ఎందుకు ట్యాగ్ చేశావు బ్ర‌ద‌ర్. ఈ విష‌యంలో మీరు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు’ అని ఆన్స‌ర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.