Asianet News TeluguAsianet News Telugu

యాటకూర తిన్నాకా.. తోటకూర తినగలమా, మల్లారెడ్డి మాట్లాడక నేను మాట్లాడినా అంతే : కేటీఆర్

మంత్రి మల్లారెడ్డిపై అభిమానం చాటుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్లారెడ్డి మాట్లాడాక నేను మాట్లాడితే యాటకూర తిన్నాక, తోటకూర తిన్నట్లు వుంటుందన్నారు. 

ktr praises minister malla reddy ksp
Author
First Published Jun 8, 2023, 3:15 PM IST

తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. 

తాజాగా మంత్రి మల్లారెడ్డిపై అభిమానం చాటుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గురువారం అడ్డాకుల మండలం వేముల-పొన్నకల్ గ్రామ శివారులో యస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్ ‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..  మల్లారెడ్డి మాట్లాడాక నేను మాట్లాడితే యాటకూర తిన్నాక, తోటకూర తిన్నట్లు వుంటుందన్నారు. దేవరకద్ర ప్రాంతంలో 2014లో కేవలం 40 వేల ఎకరాల భూమికి సాగునీరు అందేదని, ఇప్పుడు చెక్ డ్యామ్‌‌ల నిర్మాణం వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఆ పార్టీ వాళ్లు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు వస్తారని, మోసపూరిత మాటలు చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలు వస్తే పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని.. ప్రైవేట్ యాజమాన్యాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు. 

Also Read: పాలమ్మినా.. కాలేజీలు పెట్టినా అని .. ‘‘పోలీస్ ’’ స్పెల్లింగ్ రాదా : అడ్డంగా బుక్కైన మల్లారెడ్డి

ఇకపోతే.. ఇటీవల ఏదో మాట్లాడబోయి మల్లారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రిజిస్టర్‌లో రాస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెన్ను, రిజిస్టర్ అందుకున్న మల్లారెడ్డి ఏం రాయాలని అధికారులను, సిబ్బందిని రాయాలని అడగ్గా .. దానికి వారు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అని రాసి డేట్ వేయమన్నారు. ఆ వెంటనే ఆయన ‘‘పోలీస్ ’’ స్పెల్లింగ్ ఏంటి అని అడిగే సరికి అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. 

అయితే మంత్రిగారు తమను పరీక్షించడానికి అలా అంటున్నారని భావించారు. అయినప్పటికీ స్పెల్లింగ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో మెడికల్, మేనేజ్‌మెంట్ , ఇంజనీరింగ్ స్కూళ్లను నడుపుతూ.. బాధ్యత గల పదవిలో వుంటూ మల్లారెడ్డికి ‘పోలీస్’ అన్న పదానికి స్పెల్లింగ్ రాకపోవడం ఏంటని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios