హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. 

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పండుగలా జరుపుకుంటారన్నారు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం, అస్థిత్వానికి ప్ర‌తీక‌గా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. 21 ఏళ్లు పూర్తయినందున హెచ్ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. 

రేపు(ఏప్రిల్ 18) మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులతో భేటీ కానున్నట్టుగా కేటీఆర్ చెప్పారు. ఆహ్వానాలు అందినవారే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రావాలని చెప్పారు. ఆవిర్భావ సభకు వచ్చేవారికి పాస్‌లు జారీచేయనున్నట్టుగా తెలిపారు. 12,769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించాలన్నారు. 3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పారు.

Scroll to load tweet…

ఇక, ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉద‌యం 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు పార్టీ ప్ర‌తినిధుల పేర్ల న‌మోదు కార్య‌క్ర‌మం కొన‌సాగనుంది. ఉద‌యం 11:05 గంట‌ల‌కు పార్టీ అధ్య‌క్షులు కేసీఆర్ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకుని, పార్టీ జెండాను ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం స్వాగ‌తోప‌న్యాసం ఉంటుంది. ఆ త‌ర్వాత అధ్య‌క్షులు కేసీఆర్ మాట్లాడుతారు. దాదాపు 11 తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. తీర్మానాల‌ను చ‌ర్చించి ఆమోదం తెలుప‌నున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగనుంది.