భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేశారా..? ఇదే సందేహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకోవాలనుకుంటున్నానంటూ ప్రధాని మోదీ సోమవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ ట్వీట్  కి కేటీఆర్ స్పందించారు.

‘‘ ప్రధాని మోదీ ట్విట్టర్ ఎకౌంట్ ని ఎవరూ హ్యాక్ చేయలేదు కదా, లేదంటూ ఆయన డిజిటల్ డీటాక్స్ గురించి ఈ ట్వీట్ చేశారా’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. క్షణాల్లో కేటీఆర్ ట్వీట్ వైరల్ కూడా అయ్యింది. ఆ ట్వీట్ ని కొద్ది సేపటి తర్వాత కేటీఆర్ తొలగించడం గమనార్హం.

కాగా..భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కలిపి గతేడాది మే 7 నాటికి 11,09,12,648 మంది ఫాలోవర్స్ ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది.

Also Read కోట్లాది మంది ఫాలోవర్స్‌కు షాక్: సోషల్ మీడియా నుంచి తప్పుకోనున్న మోడీ..?.

పార్టీ కార్యక్రమాలతో పాటు దేశంలోని సమకాలీన అంశాలపై మోదీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. అటువంటి మోదీ సోషల్ మీడియాకు దూరమయ్యేలా పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

వచ్చే ఆదివారం నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల నుంచి ఆయన వైదొలగనున్నారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ వార్త సైతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ట్వీట్ పై పలువురు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా మోదీ ట్వీట్ కి కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాను కాదు.. మీ లోని ద్వేషాన్ని వదలండి అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరి  ఇలాంటి నిర్ణయం మోదీ ఎందుకు తీసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.