ఉత్తమ్ గడ్డంపై కేటిఆర్ కొత్త పంచ్

KTR heckles TPCC president Uttam Kumar Reddy
Highlights

హాట్ కామెంట్స్...

పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ కొత్త పంచ్ వేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్‌సింగులు కాలేరని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా మిగతా కాంగ్రెస్ లీడర్లపై కూడా కేటిఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. 
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. కేసీఆర్‌ను ఓడించడమే తన ధ్యేయమని అంటున్నారని, ప్రజలు ఆశీర్వదించి మళ్లి గెలిపిస్తే అధికారంలో కూర్చుంటామన్నారు. ఒకవేళ లేదంటే ప్రజలతో ఉండి పని చేసుకుంటామని ఆయన అన్నారు. 
ప్రజాస్వామ్యంలో బాస్ ఎవరంటే ప్రజలేనని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ అయితే ఢిల్లీకి పోయి చేతులు కట్టుకుని నిలబడాలని, తమకు ఆ అవసరం లేదని, గల్లీలో ఉండే ప్రజలే తమకు బాస్‌లని కేటీఆర్ చెప్పారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలేదని, చెయ్యిచ్చే పార్టీ అని అందరికీ తెలుసునని కేటీఆర్ అన్నారు. 
2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ రూ. 2లక్షలు చేస్తామంటే ప్రజలు నమ్మలేదని, రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా నమ్మలేదని మంత్రి విమర్శించారు. రూ. లక్ష రుణమాఫి చేస్తామంటే టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మారని, రూ. 2 లక్షలన్న పార్టీని నమ్మలేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఉత్తమ్ అన్నారని, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎంతమందికి.. ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. 
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి అమలు చేసిందని, విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, వాటిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

loader