కేటీఆర్ మంత్రాంగం.. కడియం శ్రీహరికి మద్ధతు ప్రకటించిన రాజయ్య..
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ గొడవ కొలిక్కివచ్చింది. కడియం శ్రీహరికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య మద్దతు ప్రకటించారు. కేటీఆర్ హామీతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తొలివిడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పలుచోట్ల సిట్టింగులకు అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. హైకమాండ్ పై సొంత పార్టీ నేతలే సీరియస్ అయ్యారు. కొంతమంది పార్టీ ఫిరాయించారు.స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు సీటు ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఈసారి సీటు ఖరారు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన రాజయ్య హైకమాండ్ పై యుద్ధానికి సిద్ధమయ్యారు.
చంద్రబాబుకు బిగ్ షాక్ : స్కిల్ డెవలప్ మెంట్ క్యాష్ పిటిషన్ డిస్మిస్
ఈ నేపథ్యంలోనే సందు దొరికినప్పుడల్లా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. ఈ సెటైర్ల ఉద్దేశం శ్రీహరిని ఓడిస్తా అని పరోక్షంగా చెప్పడమే. ఈ పరిణామాలు అన్నింటి నేపథ్యంలోనే తాజాగా ప్రగతి భవన్లో కడియం శ్రీహరి, రాజయ్యలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజయ్యను మంత్రి కేటీఆర్ బుజ్జగించారు. దీంతో శాంతించిన రాజయ్య వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి గెలుపుకి సహకరిస్తానని, పార్టీ కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు.
కడియం శ్రీహరికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా రాజయ్య ప్రకటించారు. ఇలా రాజయ్య పూర్తిగా మాట వినడానికి కారణం మంత్రి కేటీఆర్ ఆయనకు కీలక హామీ ఇవ్వడమేనని తెలుస్తోంది. పార్టీలో రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. రాజయ్య భవిష్యత్తుకు బిఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ భరోసాతోనే రాజయ్య మెత్తబడినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి దాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు.. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.