Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు తీర్పు మోదీ, అమిత్ షాల అహంకారానికి చెంపపెట్టు.. మంత్రి కేటీఆర్

మునుగోడు ప్రజలు అభివృద్దికి, ఆత్మ గౌరవానికి పట్టంగట్టారని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు.

KTR Comments After TRS Victory In Munugode Bypoll
Author
First Published Nov 6, 2022, 6:33 PM IST

మునుగోడు ప్రజలు అభివృద్దికి, ఆత్మ గౌరవానికి పట్టంగట్టారని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. ఈ గెలుపు కోసం పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, గులాబీ దండుకు నమస్కారాలు తెలియజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వామపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. నల్గొండ గడ్డ మీద 12 సీట్లుకు 12 సీట్లు కట్టబెట్టినందుకు అక్కడి ప్రజలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయని రుజువైందన్నారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు. మునుగోడులో పోటీ చేసి తెరపై కనిపించింది రాజగోపాల్ రెడ్డి అని.. వెనకుండి నడిపించింది అమిత్ షానేనని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా భారీ మెజారిటీ రావాల్సి ఉండేదని.. కానీ బీజేపీ నాయకత్వం వందల కోట్ల రూపాయలు తరలించి మునుగోడులో అసాధారణ పరిస్థితిని సృష్టించిందని విమర్శించారు. డబ్బుతో ఓటర్ల గొంతు నొక్కాలని బీజేపీ చూసిందని ఆరోపించారు. ఓటర్లకు పంచేందుకు డబ్బు తీసుకొస్తూ పలువురు బీజేపీకి చెందిన వ్యక్తులు పట్టుబడ్డారని అన్నారు. 

పార్టీ మారిన  వెంటనే రాజగోపాల్ రెడ్డి  కంపెనీ ఖాతాలోకి రూ. 75 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వాహలా ఆపరేటర్ మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి ఓటర్ల ఖాతాల్లోకి రూ. 5 కోట్లపైగా ట్రాన్స్‌ఫర్ చేశారని తాము ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షక పాత్ర వహించేటట్టు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

15 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు, ఐటీ బృందాలను మునుగోడులో దించి కేంద్రం దండయాత్ర చేసిందని విమర్శించారు. తాము నిజంగా అడ్డదారులు తొక్కి ఉంటే.. కేంద్ర బృందాలు చూస్తూ ఊరుకునేయా అని ప్రశ్నించారు. 2018 కంటే తమ పార్టీ అభ్యర్థికి 23 వేల ఓట్లు అధికంగా వచ్చాయని చెప్పారు. నాగార్జున సాగర్‌, దుబ్బాక, హుజుర్ నగర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ధన ప్రవాహం లేదని అన్నారు.  హుజురాబాద్, మునుగోడులలోనే ఎన్నికలు ధనమయం అయ్యాయనేది ఆలోచన చేయాలని తెలంగా ప్రజానీకాన్ని కోరుతున్నట్టుగా చెప్పారు. ధనవంతులైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఎన్నికలను ధనమయం చేశారని ఆరోపించారు. 

గెలుపుకు పొంగిపోవడం, అపజయానికి కుంగిపోవడం టీఆర్ఎస్‌కు అలవాటు లేదని అన్నారు. ఓటమిని అంగీకరించేందుకు దమ్ముండాలి చెప్పారు. బీజేపీ నేతలు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ అని విమర్శించారు. పైనున్నోడు ఫేకుడు.. కింద ఉన్నోడు జోకుడు అని ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios