కృష్ణా బోర్డులోని రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారుల ప్రమేయం లేకుండా వ్యవహరించారంటూ కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లైపై బదిలీ వేటు పడింది. 

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లైపై బదిలీ వేటు పడింది. ఆయనను ఢిల్లీకి బదిలీ చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కృష్ణా బోర్డులోని రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఇరిగేషన్ అధికారుల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించారని పిళ్లైపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తీరుపై కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ లేఖ రాశారు. 

కాగా... కృష్ణా నదీ యాజమాన్య బోర్డ్ ఆధ్వర్యంలో శనివారం రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశమైంది. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు ఈ భేటీ హాజరయ్యారు. నాగార్జున సాగర్ రూల్ కర్వ్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు తెలంగాణ ఈఎన్సీ. సీడబ్ల్యూసీ సూచనల ప్రకారమే నాగార్జున సాగర్ రూల్ కర్వ్‌పై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారాయన. 50:50 నిష్పత్తిలో పవర్ షేరింగ్‌కు ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయని తెలుస్తోంది. పవర్ హౌస్‌ల నిర్వహణ, వరద నీటి వినియోగంపైనా కమిటీ చర్చించింది. 

Also REad:శ్రీశైలం రిజర్వాయర్ రూల్ కర్వ్స్‌లో మార్పులకు తెలుగు రాష్ట్రాలు సుముఖత

మరోవైపు.. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు రిజర్వాయర్ల పర్యవేక్షక కమిటీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయం రూల్ కర్వ్స్‌లో మార్పులు చేసేందుకు ఇరు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అయితే నాగార్జున సాగర్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదన్నారు. కేంద్ర జలసంఘం సూచనల మేరకు సాగర్ రూల్ కర్వ్స్‌పై నిర్ణయం తీసుకుంటామని పిళ్లై వెల్లడించారు. మిగుల జలాల విషయానికి సంబంధించి ప్రాజెక్ట్‌లు పూర్తిగా నిండి ఓవర్‌ఫ్లో అయ్యాకే వరదను మిగులు జలాల కింద పరిగణించాలని ఇరు రాష్ట్రాలు కోరాయని ఆయన పేర్కొన్నారు.