కృఫ్ణయ్యకు నయీంతో లింకులా విచారించిన నార్సింగ్ పోలీసులు
బిసి హక్కుల ఉద్యమ నేత, తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ ఆర్. కృష్ణయ్యకు గ్యాంగ్ స్టర్ నయీంతో లింకులా? హక్కుల ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య ఎక్కడ హక్కుల మాటే వినబడకూడదనుకునే గ్యాంగ్ స్టర్ నయీం ఎక్కడ? వీరిద్దరికీ లింకులున్నాయని నార్సింగ్ పోలీసులు శాసనభ్యుడిని విచారించాటమేమిటని పలువురు విస్తు పోతున్నారు.
నయీం కేసు విచారణలో భాగంగా పోలీసులు బుధవారం కృష్ణయ్యను విచారించేందుకు నోటీసులు జారీ చేసారు. ఎంఎల్ఏ కూడా నోటీసులు అందుకోగానే నార్సింగ్ పోలీసు స్టేషన్ కు వెళ్ళారు. సుమారు గంటపాటు పోలీసులు ఎంఎల్ఏను విచారించిన తర్వాత విడిచిపెట్టారు.
అనంతరం కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ, తనకు నయీంతో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని గతంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. అయితే, పోలీసులు అనుమానిస్తున్నట్లు తాను ఎటువంటి దందాలు చేయలేదని స్పష్టం చేసారు.
గతంలో జరిగిన ఒక హత్యకు సంబధించిన వివరాలను అడిగేందుకు తనను పోలీసులు పిలిపించినట్లు చెప్పారు. నయీం కేసులకు సంబంధించి ఎప్పడు అవసరమైనా విచారణకు తాను హాజరవుతానని చెప్పినట్లు కూడా తెలిపారు.
తనకు 24 గంటలూ ఉద్యమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలతోనే సమయం సరిపోతుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. నయీంతో కలిసి తాను భూ దందాలు కానీ లేదా సెటిల్ మెంట్లు గానీ చేసినట్లు ఆధారాలుంటే నిరూపించాలని సవాలు విసిరారు. నయీంతో కలిసి దందాలు చేయాల్సిన అవసరం లేనే లేదన్నారు.
