తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 36, ఏపీకి 17 టీఎంసీలు వాడుకునేందుకు అనుమతినిచ్చింది. ఆగస్టు 31 వరకు ఈ నీటిని వాడుకోవాలని బోర్డు తెలిపింది.

ఇక తెలంగాణ ప్రభుత్వం  వాడిన క్యారీ ఓవర్ నీటి విషయంలో త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. కాగా శ్రీశైలం ఎడమగట్టు నుంచి నీటి విడుదల ఆపాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ 32.27 టీఎంసీల నీటిని విడుదల చేసిందని ఏపీ ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని కూడా లేఖలో పేర్కొంది. నీటిని ఇంకా దిగువకు వదిలితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయని ఏపీ ప్రభుత్వం గతంలోనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

బోర్డు ఇంకా  నీటి కేటాయింపులు చేయకపోయినా ముందే తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి ప్రారంభించిందని ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.