హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరే విషయం మలుపు తిరిగింది. ఏమైందో తెలియదు గానీ ఆయనను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై బ్రేక్ లు పడినట్లు తెలుస్తోంది.

గజ్వెల్ లో తనపై పోటీ చేసిన వంటేరు ప్రతాప రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిద్ధపడినట్లు గురువారం సాయంత్రం వార్తలు గుప్పు మన్నాయి. అయితే, తెల్లారేసరికి విషయం తిరగబడింది.

వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారనే వార్తలను మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. వంటేరు ప్రతాపరెడ్డి కావాలనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. 

వంటేరు టీఆర్ఎస్‌లోకి వస్తానని చెప్పినా కూడా పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో చేరాలని వంటేరును తమ పార్టీ నుంచి ఎవరూ సంప్రదించలేదని ఆయన చెప్పారు.
 
వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో వంటేరు కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ, 2019లో కాంగ్రెస్ తరఫున వంటేరు పోటీ చేశారు.