తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు కర్ణాటకలోని బీదర్ పట్టణంలో పట్టుబడ్డారు.
జగిత్యాల : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేసారు. మూడురోజుల క్రితం ముసుగులు ధరించి అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు భారీగా స్వామివారి వెండి, బంగారం ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఆధారంగా దొంగలను గుర్తించిన పోలీసులు వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చేపట్టి ఎట్టకేలకు అరెస్ట్ చేసారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో కొండగట్టు దొంగలున్నట్లు పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు అక్కడికెళ్లారు. స్థానిక పోలీసుల సహకారంతో దొంగలు తలదాచుకున్న ప్రాంతానికి వెళ్లి అరెస్ట్ చేసారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు జగిత్యాలకు తరలించారు. కొండగట్టు ఆలయంలో చోరీచేసిన సొమ్ములో 60శాతం ఇప్పటికే రికవరీ చేసినట్లు సమాచారం. మిగతా సొత్తును కూడా గుర్తించి స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు.
అయితే కొండగట్టు ఆలయ దొంగల అరెస్టుకు సంబంధించి పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. దొంగలను విచారణ పూర్తయిన అనంతరం చోరీ సొత్తు మొత్తం రికవరీ చేసినతర్వాత దొంగలను మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి.
Read More కొండగట్టు అంజన్న ఆలయంలో విగ్రహాలు, శటారి, తోరణం ఎత్తుకెళ్లిన దొంగలు..
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన అనంతరమే కొండగట్టు ఆలయంలో ఛోరీ జరగింది. ప్రభుత్వం ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతామని ప్రకటన చేసిన తర్వాత ఆలయంలో భద్రతావైఫల్యాలు బయటపడ్డాయి. సెక్యూరిటీ కళ్లుగప్పి ఆలయంలోకి చొరబడ్డ దొంగలు తాపీగా స్వామివారి వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఈ దొంగతనం కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని మూడు రోజుల్లోనే దొంగలను పట్టుకున్నారు.
ముసుగులు ధరించి ఆలయంలోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు 15కిలోల వెండితో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. 5 కిలోల స్వామివారి వెండి ప్రేమ్, 2 కిలోల మకరతోరణం, 3 కేజీల నాలుగు శఠగోపాలు, 5 కేజీల స్వామివారి తొడుగు చోరీకి గురయినట్లు ఆలయ అధికారులు గుర్తించారు. ఈ దొంగతనం సిసి కెమెరాల్లో రికార్డవడంతో ఈ దొంగలను గుర్తించి పట్టుకోవడం పోలీసులకు సులభమయ్యింది.
ఇదిలావుంటే ఆలయంలో దొంగతనం జరగడంపై దేవాదాయ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
