Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు ప్రచారానికి హోంగార్డులు వెళ్లరు.. ఎస్పీలే వెళతారు: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోనని చెప్పేశారు. 

Komatireddy Venkat Reddy Key Comments on Munugode Bypoll Campaign
Author
First Published Oct 17, 2022, 1:46 PM IST

కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోనని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీ భవన్‌కు వచ్చిన కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని.. ఎస్పీ స్థాయి నేతలే వెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో కాంగ్రెస్‌లోని కొందరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌‌గా కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. 

వంద కేసులు పెట్టినా సరే ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఓ నేత చెప్పాడని.. అలా అన్న పెద్దాయనే మునుగోడులో కూడా గెలిపిస్తాడని అన్నారు. తనతో ఏం పని అని చెప్పారు. తానెప్పుడూ విదేశాలకు వెళ్లేది.. కేటీఆర్‌ను అడగండి అంటూ కామెంట్ చేశారు.  

ఇక, గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా  తప్పుచేశావు వెంకన్న అని వీహెచ్ అనగా.. తనను అవమానిస్తే ప్రచారానికి ఎలా వెళ్లాలని వెంకట్ రెడ్డి సమాధానమిచ్చారు. తనను పలు సందర్భాల్లో తిట్టారని.. అయినప్పటికీ పార్టీ మీద అలిగానా అని అన్నారు. తాను తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు  చేశానని.. చిన్న, చిన్న విషయాలు పట్టించుకోనని చెప్పారు. 

గతంలో కాంగ్రెస్‌ను వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘34 ఏళ్లుగా పనిచేసిన హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్‌ కూడా కాలేడు. సివిల్స్‌ పరీక్ష రాసి జిల్లా ఎస్పీ అయినోళ్లను పట్టుకుని.. నేను ఇన్నేళ్లు ఎస్పీ ఆఫీస్‌ దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవు తావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తాయి’ అని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే తనకు పీసీసీ ఇవ్వడాన్ని  ప్రశ్నించేవారిని ఉద్దేశించి.. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారంజరిగింది.

అయితే రేవంత్ రెడ్డి హోం గార్డు వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు. ట్విట్టర్ ప్రొఫైల్ బయోలో.. తాను కాంగ్రెస్ పార్టీ హోంగార్డునని పేర్కొన్నారు. బయోలో.. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో హోంగార్డులో సేవ చేస్తున్నట్టుగా యాడ్ చేశారు. కొన్ని గంటల  తర్వాత దానిని తొలగించారు. అయితే అప్పటినుంచి.. సొంత పార్టీ నేతలనే తనను దూషించడం జీర్ణించుకోలేకపోతున్నానని కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఆత్మ ప్రబోధానుసారం తాను మునుగోడులో ప్రచారానికి వెళ్లాలా? లేదా? అనే దానిపై  నిర్ణయం తీసుకొంటానని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios