మునుగోడు ప్రచారానికి సిద్ధమన్నారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు తన నిర్ణయం ప్రకటించారు.
మునుగోడు ప్రచారానికి సిద్ధమన్నారు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎప్పుడూ ఆదేశించినా ప్రచారానికి వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. భట్టి విక్రమార్కతో అభ్యర్ధి ఎంపికపై చర్చించామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సోనియా, ప్రియాంక నిర్ణయం మేరకే అభ్యర్ధి ఎంపిక వుంటుందని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇకపోతే.. బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయపరిస్థితులతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు నేతలంతా కలిసి పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. సుమారు 40 నిమిషాలపాటు పార్టీకి చెందిన అంశాలపై చర్చించామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రియాంక గాంధీపై చర్చించిన పార్టీ అంతర్గత విషయాలను తాను మీడియాకు చెప్పబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే ఎప్పుడైనా తనతో చెప్పాలని ప్రియాంక గాంధీ తనకు సూచించారనన్నారు. తనకు కూడా ప్రియాంక గాంధీ కొన్ని సలహాలు, సూచనలు చేశారని కూడా కోమటిరెడ్డి చెప్పారు.
ALso Read:కోమటిరెడ్డితో చర్చించాకే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించాలి: కాంగ్రెస్ నేతలకు ప్రియాంక ఆదేశం
అంతకుముందు రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. తనను నిత్యం అవమానిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్దితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ విషయమై సోనియాగాంధీకి లేఖ రాశారు.. దీంతో ప్రియాంక గాంధీ నుండి ఆహ్వానం రావడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ఆమెతో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో కూడ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక విషయంలో కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో చర్చించాలని కూడా పార్టీ నేతలకు ప్రియాంక గాంధీ సూచించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలుపుకుని వెళ్లాలని, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిపై ఆయనతో చర్చించాలని పార్టీ రాష్ట్ర నాయకులకు ప్రియాంక సూచించారు.
