ముఖ్యమంత్రి సహా ఎలాంటి ఉన్నత పదవులపైనా తనకు ఆశ లేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టీపీసీసీ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించిన పార్లమెంటరీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి.. టీఆర్ఎస్ సర్కారును గద్దె దించడమే తన ప్రధాన కర్తవ్యమని అన్నారు. కేటీఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారని.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరిట వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

డబ్బులు రావన్న ఉద్దేశంతోనే పాత పథకాలను పట్టించుకోవడం లేదని.. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ.. బీబీ నగర్ నిమ్స్‌‌పై లేదని నల్గొండ జిల్లాపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలను గెలిచి సోనియా గాంధీకి కానుకగా అందిస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెడతామని అన్నారు. తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు లేదని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.