భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప వేరే ఉద్దశం లేదు.. వివాదాస్పద ఆడియో క్లిప్‌పై కోమటిరెడ్డి వివరణ..
టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌లను కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే
టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌లను కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్టుగా చెబుతున్న ఫోన్ కాల్ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. సుహాస్‌కు ఫోన్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సుధాకర్ తనను వందసార్లు తిట్టాడని.. కార్లలో అతనిని చంపడానికి తిరుగుతున్నారని అన్నారు. ‘‘నిన్ను కూడా చంపుతారు.. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు’’ అని సుహాస్‌తో అన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారడంతో తీవ్ర కలకలం రేగింది.
అయితే ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే తప్ప దీని వెనకాల వేరే ఉద్దేశం లేదని తెలిపారు. నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటీ నుంచి తనను తిడుతున్నాడని అన్నారు. చెప్పలేని మాటలు అంటున్నాడని తెలిపారు. మూడు నెలలుగా సోషల్ మీడియా వేదికగా ఒకటే దూషణలు చేస్తున్నారని అన్నారు. దరిద్రుడని, చీడపురుగు అని తిడుతున్నారని.. దాని గురించి అడగడానికే ఫోన్ చేశానని చెప్పారు. 33 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించలేదని తెలిపారు. శత్రువులు, ప్రత్యర్థులను కూడా దగ్గరికి తీసే మనస్తత్వం తనదని చెప్పారు.
అయితే తాను మాట్లాడిన చాలా విషయాలను కట్ చేశారని అన్నారు. కొన్ని మాటలను మాత్రమే లీక్ చేశారని చెప్పారు. తాను మాట్లాడే సమయంలో కొంత భావోద్వేగానికి గురైనట్టుగా చెప్పారు. తాను ముందు చెప్పిన మాటలను కట్ చేసి ఆడియో లీక్ చేశారని.. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తన కొడుకు పేరుతో ఫౌండేషన్ పెట్టి ఎంతో సేవ చేశానని అన్నారు.
వాళ్లకు నచ్చిన నాయకుడు వద్ద మెప్పుకోసం తనను తిడితే టికెట్ వస్తుందని ఇలా చేయడం సరికాదని అన్నారు. ఇంతటితో దీనిని ముగిద్దామని కోరారు. ఎవరినీ దూషించడం ఉద్దేశం కాదని.. ఇకపై ఇలాంటి భాష వాడనని చెప్పారు.
ఇక, చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహాస్‌లను తమ వాళ్లు చంపేస్తారని కోమటిరెడ్డి ఫోన్ చేసి బెదిరించినట్టుగా చెబుతున్నఆడియో రికార్డింగ్ ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోమటిరెడ్డికి చెందినదిగా చెబుతున్న ఆ ఆడియోలో.. ‘‘నువ్వు నీ నాన్న వీడియో చూశావా?. నన్ను వందసార్లు తిట్టాడు. నెల రోజులు ఓపికగా వాటిని విన్నాను. నా మద్దతుదారులు వందలాది కార్లలో బయలుదేరారు. వారు మిమ్మల్ని ఎక్కడ కనిపించినా చంపేస్తారు. నేను లక్షల మందిని బతికించినా.. వానికి ఎంత ధైర్యం రా. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి.. వాన్ని ఒదిలిపెట్టారా? వార్నింగ్ ఇస్తున్నా?. నిన్ను కూడా చంపుతారు.. నీ ఆస్పత్రిని కూడా కూలగొడతారు.
మేము వెళ్లినం బయటకు.. ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తామని అంటున్నారు. క్షమాపణ చెప్పకపోతే నా వాళ్ళు చంపేస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపితే నేనొక్కడినే వెళ్లి పరామర్శించాను. మీరు కౌన్సిలర్‌గా కూడా గెలవలేరు.. కానీ నన్ను విమర్శించే ధైర్యం చేస్తా’’ అని పేర్కొన్నారు.
అయితే ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ.. సీడబ్ల్యూసీలో అవకాశం ఇస్తే మరింత బాగా పనిచేస్తానంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన కామెంట్స్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా వివాదం చోటుచేసుకుందనే చర్చ టీ కాంగ్రెస్‌లో నడుస్తోంది.
చెరుకు సుధాకర్ సీరియస్..
ఎంపీ కోమటిరెడ్డి బెదిరింపులకు సంబంధించి చెరుకు సుధాకర్ తీవ్రంగా స్పందించారు. తాను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నామని.. ఆయన తనపై అత్యంత దారుణమైన భాష వాడారని అన్నారు. ఈ ఆడియోను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించానని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. కోమటిరెడ్డిని తాను వ్యక్తిగతంగా దూషించలేదని చెప్పారు. నయీం లాంటి తీవ్రవాదే తనను ఏం చేయలేకపోయాడని అన్నారు.