భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ గతంలో వరంగల్ సభలో చేసిన ప్రకటన కీలకంగా మారింది.

తెలంగాణలో పొత్తులపై భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గతంలో చేసిన ప్రకటన కీలకంగా మారింది. రాహుల్ గాంధీ చెప్పిన విషయమే తాను చెప్పానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తాను తొలుత చేసిన వ్యాఖ్యలు వివాదం కావడంతో వివరణ ఇచ్చారు. ఆ వివరణలో ఆ విషయం చెప్పారు. తెలంగాణలో ఎన్నికల తర్వాత బిఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని, తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తొలుత అన్నారు. 

సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. పొత్తులపై గతంలో వరంగల్ సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను గుర్తు చేశారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ తమకు పొత్తులు ఉండవని రాహుల్ గాంధీ వరంగల్ సభలో చెప్పారు. ఈ విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదని, తెలంగాణలో బిఆర్ఎస్ తమకు ప్రత్యర్థి అన్నారు. 

Also Read: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తుండదు, రాహుల్‌ చెప్పిందే చెప్పా , హంగ్‌పైనా మాట మార్చిన కోమటిరెడ్డి

తాను తొలుత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు బుధవారం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ థాక్రేను కలవాల్సి ఉంది. థాక్రే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీశారు. ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను తెప్పించుకున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని విమర్శించారు. 

రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. తన వ్యాఖ్యల ద్వారా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడి నియమించడం ఆయన ఏ మాత్రం ఇష్టం లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరకు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. తిరిగి మునుగోడు అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే, మునుగోడులో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలు కావడంతో వెనక్కి తగ్గినట్లు చెబుతారు. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనేది తెలియదు. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ ను నష్టపరుస్తున్నారనే విమర్శలు రేవంత్ రెడ్డి వర్గం నుంచి వినిపిస్తున్నాయి.