వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందంటూ ఆ పార్టీ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మాట మార్చారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తుండదని ఆయన తెలిపారు. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ థాక్రేతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలోని లాంజ్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే తాను ఇప్పుడు చెప్పినట్లు కోమటిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు వుండదని వెంకట్ రెడ్డి అన్నారు. చిన్న చిన్న నాయకులు కూడా తనను తిట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నా వ్యాఖ్యల్ని రాజకీయం చేస్తున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో హంగ్ వస్తుందని తాను అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఏ కమిటీలోనూ లేనని.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి తాను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని కోమటిరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్‌తో పొత్తు వుంటుందని కూడా తాను చెప్పలేదని.. తన వ్యాఖ్యలు అర్ధం అయ్యే వాళ్లకు అర్ధం అవుతాయని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 

కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులుంటాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకంట్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సెక్యులర్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమయ్యాయి. 

Also REad: అంతా అధిష్టానం చూసుకుంటుంది.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన

దీనిపై కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌తో తమ పార్టీ పొత్తుకు సిద్దంగా లేదన్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటలే ఫైనల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. తమ పార్టీతో పొత్తుకు బీఆర్ఎస్ కూడా ఆలోచన చేయదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు గతంలో పనిచేసిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు. తమపై ఆరోపణలు చేసే అర్హత బీజేపీకి లేదని జగ్గారెడ్డి చెప్పారు. 

కాంగ్రెస్ లో ముఖ్య నాయకుడు ఒకరు పార్టీలో కోవర్టులున్నారని చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 2023 ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ కూడా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని జగ్గారెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారన్నారు . ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. పార్టీలో స్టార్ లు , సూపర్ స్టార్లు ఇట్లా మాట్లాడుతుంటే ఎవరికి ఏం చెప్పే పరిస్థితి లేదన్నారు