హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపుతోంది. మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అవుతానంటూ ఓ కార్యకర్తను బుజ్జగిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని తెలిసిన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఫోన్ చేయగా ఆ వ్యక్తితో కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 

మిమ్మల్ని ఎమ్మెల్యే చేసేందుకు తాను ఎంతో కష్టపడ్డానని, పాదయాత్ర కూడా చేశానని అయితే ఇప్పుడు పార్టీ మారడం సరికాదంటూ ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దంటూ కోరారు. 

కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరుతున్నారని తెలిసి చాలా బాధపడుతున్నానని ఆ కార్యకర్త కోమటిరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది. ఎవరూ బాధపడొద్దని అంతా కలిసే బీజేపీలో చేరదామంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. 

బీజేపీలో చేరితో భవిష్యత్తులో తానే సీఎం అవుతానంటూ ఆ కార్యకర్తను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ కార్యకర్త సైతం తమను సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తోందని తానే సీఎం అవుతానన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను తట్టుకోలేక రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు వీడుతున్నా పట్టించుకోవడంలో ఉత్తమ్, కుంతియా ఫెయిల్ అయ్యారని తెలిపారు. 

రాహుల్ గాంధీని, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను తాను వదిలేసినట్లు తెలిపారు. దేశప్రజలంతా ప్రధాని నరేంద్రమోదీ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్ లో తాను బీజేపీలో చేరతానంటూ చెప్పుకొచ్చారు. అంతా కలిసి పోదామని తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని రాహుల్ గాంధీకి సైతం తెలుసునన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.  

 ఇకపోతే ఈనెల 28న ఢిల్లీలోని బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. 

అయితే తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ఎలా ఉన్నా కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను కడవరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు.