తాను ఎవ్వరికీ అమ్ముడుపోలేదని, తనని కొనేశక్తి ఎవ్వరికీ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్వార్ధం కోసం పార్టీ మారే వాడు.. ఉపఎన్నికలో యుద్ధానికి సిద్ధమని చెబుతాడా ఆయన ప్రశ్నించారు.
50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆదివారం మునుగోడులో జరిగిన బహిరంగసభలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజీనామాతో కేసీఆర్ దిగివచ్చాడా లేడా అని ఆయన ప్రశ్నించారు. తనకు పదవి ముఖ్యం కాదని.. మీకోసమే దానిని త్యాగం చేశానని కోమటిరెడ్డి అన్నారు. స్వార్ధం కోసం పార్టీ మారే వాడు.. ఉపఎన్నికలో యుద్ధానికి సిద్ధమని చెబుతాడా అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
తప్పు చేసిన వాడు భయపడతాడని.. స్వార్ధం వున్నవాడు ఇంట్లో కూర్చొంటాడని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. పార్టీలకతీతంగా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. తాము పోరాడి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఎవరి పాలైందని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు గానీ.. ఆత్మగౌరవాన్ని వదులుకోరని ఆయన వ్యాఖ్యానించారు.
ALso Read:కేసీఆర్ ప్రశ్నలను పట్టించుకోని అమిత్ షా.. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే టీఆర్ఎస్‌కు పొగేనంటూ వ్యాఖ్యలు
ఈ ఉపఎన్నిక వచ్చింది ఓ వ్యక్తి కోసమే, పదవి కోసమే, పార్టీ కోసమో కాదని.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసమన్నారు. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ధర్మ యుద్ధంలో ప్రజలు బీజేపీ వెంట వుండాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ అభ్యర్ధిని కూడా డిక్లేర్ చేయలేని పరిస్థితిలో కేసీఆర్ వున్నారని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. మీరు తప్పు చేయకపోతే... ఈడీ, మోడీ అని ఎందుకు భయపడుతున్నారని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని.. ముఖ్యమంత్రి పతనం మునుగోడు నుంచి ఆరంభమైందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.
