తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన ప్రశ్నలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమాత్రం పట్టించుకోలేదు. మునుగోడులో జరిగిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ ఎన్నికల హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు. 

కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం మునుగోడులో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. పొగ మాదిరిగా కేసీఆర్ సర్కార్ మాయమైపోతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం చేస్తానని కేసీఆర్ చెప్పారని.. ఈ విషయంలో కేసీఆర్ మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read:కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై అమిత్ షా రేపటి సభలో సమాధానం చెప్పాలి.. సీఎం కేసీఆర్

వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. మన ప్రభుత్వం వచ్చాక విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 3 వేలు ఇస్తామని వాగ్థానం చేశారని.. అమలు జరుగుతోందా అని అమిత్ షా ప్రశ్నించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం హామీ ఏమైందని ఆయన నిలదీశారు. పేద, బడుగు వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఏమైందని అమిత్ షా ప్రశ్నించారు. దళిత సీఎం హామీ ఏమైందని కేసీఆర్‌ను నిలదీశారు. మరోసారి టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సీఎం వుంటారని అమిత్ షా జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల వేళ దళితబంధు హామీ ఇచ్చారని.. కానీ అమలు జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు. 

తెలంగాణ రైతుల్ని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని .. ప్రధాని రైతు బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రతీ రైతు నుంచి ధాన్యం సేకరిస్తామని.. దొడ్డు బియ్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఏటీఎం లాంటిదని అమిత్ షా చురకలు వేశారు. తెలంగాణలోనే అధిక ధరలు వున్నాయని.. పెట్రో ధరలు ఎక్కువని, పన్నులు కూడా తగ్గించలేదని ఆయన మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రెండు సార్లు పెట్రో ధర తగ్గించిందని.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అమిత్ షా చురకలు వేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా వుంటామని కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు.