కల్వకుంట్ల కవిత గెలిస్తే రాజకీయ సన్యాసం: కోమటిరెడ్డి

KomatiReddy challenges Kalvakuntla Kavitha
Highlights

వచ్చే ఎన్నికల్లో కవిత గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసిఆర్ సర్వేలన్నీ బూటకమని అన్నారు. సోనియాను అమ్మ కాదు బొమ్మ అనడంపై మండిపడ్డారు.

నిజామాబాద్‌: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి వంద సీట్లు రావని ఆయన జోస్యం చెప్పారు. 

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సర్వేలు అంతా బూటకమని అన్నారు.తనను, సంపత్‌కుమార్‌ను అన్యాయంగా ఎమ్మెల్యే సభ్యత్వాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారని, అయితే చివరకు న్యాయమే గెలిచిందని ఆయన అన్నారు. 

తమ ఇద్దరి శాసనసభ్యత్వాలు ఇంకా పునరుద్ధరించలేదని, హైకోర్టు ఉత్తర్వులను సైతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమని అన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం దోపిడీకే ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే అవినీతిలో తెలంగాణ అగ్రభాగాన ఉందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడాలేని వింతగా కాళేశ్వరం ప్రాజెక్టును టీఆర్‌ఎస్‌ చూపిస్తోందని, అయితే గతంలో తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులు కడితే కాంగ్రెస్‌ పార్టీకి పేరు వస్తుందనే కారణంతో వాటిని పక్కన పెట్టేశారని కోమటిరెడ్డి ్న్నారు. 

తమ పార్టీ నేత సోనియాగాంధీని అమ్మకాదు బొమ్మ అని కేటీఆర్ అనడం దురదృష్టకరమని అన్నారు. వాళ్ల అమ్మను ఆ నేతలు అలాగే సంబోధిస్తారా అని ప్రశ్నించారు. రైతు బంధు పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని అన్నారు. అధికార భయంతో సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితం అయ్యారని ఆయన అన్నారు.

శ్రీ చైతన్య కార్పొరేట్‌ గా లూటీ చేస్తోందని, అలాంటి యాజమాన్యాలను అడ్డుకుని కాలేజీల పర్మిషన్లు రద్దు చేయాలని, దీనిపై త్వరలోనే కోర్టులో కేసు వేస్తామని అన్నారు.

loader