కోమటిరెడ్డి, సంపత్ మీద శాశ్వత వేటు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ మీద కఠినమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ అసెంబ్లీ. వారిద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన శృతి మించిందని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించింది. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ ఫోన్స్ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తగిలి ఆయనకు గాయమైంది. దీనిపై తీవ్రంగా స్పందించింది టిఆర్ఎస్ సర్కారు. ఈ ఘటనకు పాల్పడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు ఆయనకు జత కలిసిన అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఇద్దరి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ సభలో తీర్మానం పెట్టి ఆమోదించారు. వీరితోపాటు మరో 11 మంది కాంగ్రెస్ సభ్యులను ఈ శాసనసభా సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తూ శాసనసభ నిర్ణయించింది. వారి సస్పెన్షన్ నిర్ణయాన్ని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారందరినీ స్పీకర్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే తాను ఎవరిని టార్గెట్ చేస్తూ హెడ్ ఫోన్ విసరలేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే తాను విసిరిన హెడ్ ఫోన్స్ స్వామి గౌడ్ కు తగిలినట్లు ఆధారాలు చూపాలన్నారు. ఆధారాలు చూపితే తాను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ చేశారు. తాను విసిరినట్లు మాత్రమే వీడియోలు బటయ పట్టారు కానీ.. స్వామి గౌడ్ కు తగిలినట్లు ఎక్కడా వీడియోలు బయట పెట్టలేదన్నారు కోమటిరెడ్డి.

మొత్తానికి కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లు అధికార పార్టీపై కరుకుగా ప్రవర్తిస్తున్న సమయంలో వారిద్దరినీ అసెంబ్లీ మెట్లెక్కకుండా ఈ టర్మ్ వరకు బహిష్కరించడం రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతున్నది.