మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై విమర్శలు గుప్పించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి.  జూపల్లి నిజస్వరూపం ఏంటో.. కొల్లాపూర్‌లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసునని ఆయన  పచ్చి అవకాశవాదని బీరం మండిపడ్డారు. 

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో మరోసారి చర్చనీయాంశమవుతోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో వున్న ఆయన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావుపై మండిపడ్డారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి. జూపల్లి పచ్చి అవకాశవాదని.. ఆయన వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. కృష్ణారావు చెబుతున్న కేసులపై తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. జూపల్లి నిజస్వరూపం ఏంటో.. కొల్లాపూర్‌లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసునని.. ఆయన గత ఎన్నికల్లో ఓడించినా బుద్ధి రాలేదని హర్షవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. 

అంతకుముందు ఆదివారం ఉదయం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. హర్షవర్ధన్ రెడ్డి అక్రమాలపై ఎన్నిసార్లు చెప్పినా హైకమాండ్ పట్టించుకోవడం లేదన్నారు. తనకు గడిచిన మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ బుక్‌లెట్లు కూడా ఇవ్వలేదని.. తాను పార్టీలో వున్నానో లేదో అధిష్టానానికి తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా తనకు బీ ఫారాలు ఇవ్వలేదన.. అయతే తన మద్ధతుదారులు స్వతంత్రులుగా గెలిచారని కృష్ణారావు వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో కూడా జరగని దాడులు ఇప్పుడు జరుగుతున్నాయని.. ప్రగతి భవన్ ఎలా ఆడమంటే అంతా అలా ఆడుతున్నారని జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: పొంగులేటి ఆత్మీయ సమ్మేళానికి జూపల్లి: ఏం జరుగుతుంది?

కాగా... గత కొద్దిరోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్‌ టీఆర్ఎస్‌లో జూపల్లి విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. 

ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరు కాకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే దానిపై స్పందించిన జూపల్లి.. తాను టీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో జూపల్లిని కలిసిన మంత్రి కేటీఆర్‌ సర్దుకుపోవాలని సూచించినట్లుగా సమాచారం. అయినప్పటికీ కొల్లాపూర్‌లో ఎలాంటి మార్పూ రాలేదు.