కొల్లాపూర్: కొల్లాపూర్  అసెంబ్లీ నియోజకవర్గంలో 1999 నుండి  జూపల్లి కృష్ణారావు వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి వరుసగా ఆయన ఐదు దఫాలు విజయం సాధించారు. గతంలో కె. వెంకటేశ్వర్ రావు వరుసగా మూడు దఫాలు విజయం సాధించారు.

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.  ఆ ఎన్నికల సమయంలో కమ్యూనిష్టులపై నిషేధం ఉండడంతో పీడీఎఫ్ పేరుతో  కమ్యూనిష్టులు పోటీ చేశారు. 1952లో  పీడీఎఫ్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అనంతరామచంద్రారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శాంతాబాయిపై విజయం సాధించారు. 1957లో  కాంగ్రెస్ అభ్యర్థి ఎం. నర్సింగరావు తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి కె. గోపాల్ రావుపై విజయం సాధించారు. 1962లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగదాస్  తన సమీప పీడీఎప్ అభ్యర్ధి కె.గోపాల్ రావుపై గెలిచారు.

1967లో  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  బరిలోకి దిగిన నర్సింహ్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కె. రంగదాస్‌పై విజయం సాధించారు. 1972లో  కె. రంగదాస్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొత్త వెంకటేశ్వరరావుపై నెగ్గారు.

1978 నుండి 1985 వరకు  కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా  ఈ స్థానం నుండి మూడు దఫాలు విజయం సాధించారు.  1978లో  కాంగ్రెస్ అభ్యర్ధి కొత్త వెంకటేశ్వరరావు తన సమీప  జనతా అభ్యర్థి కె. రంగదాస్‌పై విజయం సాధించారు. 1983 లో కూడ కాంగ్రెస్ అభ్యర్ధిగా కొత్త వెంకటేశ్వరరావు పోటీ చేసి  తన సమీప టీడీపీ అభ్యర్థి  కేవీఎన్ గుప్తపై  విజయం సాధించారు.1985లో కొత్త వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున మరోసారి బరిలోకి దిగి సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్ రెడ్డిపై విజయం సాధించారు.

1989లో కాంగ్రెస్ అభ్యర్థి కె. రామచంద్రారావు చేతిలో సీపీఐ అభ్యర్థి సురవరం సుధాకర్ రెడ్డి ఓడిపోయారు.  1994లో టీడీపీ అభ్యర్థిగా కె. మధుసూధన్ రావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కె. రామచంద్రరావుపై విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు తన సమీప టీడీపీ అభ్యర్థి కె. మధుసూధన్ రావుపై విజయం సాధించారు. 1999 నుండి  ఇప్పటివరకు ఆయన  వరుసగా విజయం సాధిస్తున్నారు.

2004లో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ టిక్కెట్టు జూపల్లి కృష్ణారావుకు దక్కలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ తో పొత్తు కారణంగా ఆ స్థానం టీఆర్ఎస్ కు వెళ్లింది. దీంతో  స్వతంత్ర అభ్యర్ధిగా  జూపల్లి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కె. మధుసూధన్ రావుపై నెగ్గారు.

2009లో జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు తన సమీప టీడీపీ అభ్యర్థి చింతలపల్లి జగదీశ్వర్‌రావుపై విజయం సాధించారు.2012లో దేవాదాయ శాఖ మంత్రి పదవికి జూపల్లి కృష్ణారావు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి కూడ ఆయన రాజీనామా చేశారు. తెలంగాణ సాధన పేరుతో మహాబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో జిల్లాలో మంత్రిగా ఉన్న డీకే అరుణ జూపల్లి పాదయాత్రను అడ్డుకొంది.

2012లో  కొల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధిగా జూపల్లి కృష్ణారావు పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి విష్ణువర్ధన్ రెడ్డిపై విజయం సాధించారు.2014లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై  విజయం సాధించారు.  2018లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావు పోటీ చేస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో  పంచాయితీరాజ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు కొనసాగుతున్నారు.  కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు విజయం సాధించినవారిలో వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే  అత్యధికంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

నకిరేకల్‌లో నర్రాదే హవా: ఐదుసార్లు వరుసగా విజయం

సిద్దిపేట సరళి: మామను మించిన అల్లుడు

కేసీఆర్ ఇలాకాలో గతంలో కాంగ్రెస్‌దే హవా