నాడు  కోదండరాంపై మాట పడనీయని పార్టీ యే ఇప్పుడు ఆయన మీద మాటలతూటాలు పేల్చుతోంది.

ఉద్యమ సమయంలో తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ కోదండరాం ను టీఆర్ఎస్ ఏజెంట్ గా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీ కోదండరాంను కాంగ్రెస్ ఏజెంట్ అంటోంది.

తెలంగాణ పోరాటంలో కోదండరాంకు టీఆర్ఎస్ ఓ రక్షణ కవచంలా నిలబడింది అంటే అతిశయోక్తి కాదు.

సీమాంధ్ర నేతలు ఆయనపై విమర్శలు చేస్తే స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి తనదైన స్టైల్ లో వారికి చురకలు అంటించేవారు.

అసలు కోదండరాంను టీజేఏసీ కన్వీనర్ ను చేసేందే కేసీఆర్ అని గులాబీ శ్రేణులు బల్లగుద్ది చెబుతుంటాయి. నాటి ఉద్యమ సమయంలో టీజేఏసీ ఒకే జెండాగా, ఒకే అజెండాతో ముందుకు వెళ్లాయి.

టీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే టీజేఏసీ వారిని గెలిపించేందుకు ఊరువాడ తిరిగింది. గులాబీ కండువా వేసుకోవడం తప్పతే అన్ని ప్రచార కార్యక్రమాలు చేసింది.

నాడు ఇది కాంగ్రెస్ కు కలవరం కలిగించింది. ఆయనను టీఆర్ఎస్ కార్యకర్తగా చిత్రీకరించింది. చివరకు టీజేఏసీ నుంచి బయటకొచ్చింది.

2014 ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు టీజేఏసీ మద్దతివ్వకపోవడంతో పరిస్థితి మారింది. టీజేఏసీ తమకు ఎందుకు మద్దతివ్వదో చెప్పాలని కేసీఆర్ ఎన్నికల ప్రచార వేళ నిలదీశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీజేఏసీ అవసరం లేదని అన్నారు.

అనడమే కాదు టీ జేఏసీని చీల్చే ప్రయత్నాలు చేశారు. అందులో కీలక వ్యక్తులను తన పార్టీ లో లాగారు.

అయినా కోదండరాం, మిగిలిన జేఏసీ నేతలు వెనక్కి తగ్గలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాపాలదారులుగా ఉంటామని కేసీఆర్ కు ధీటైన సమాధానం ఇచ్చారు. తెలంగాణ

పునర్ నిర్మాణానికి జేఏసీ ఉండాలని అభిప్రాయపడ్డారు.

రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ తన హామీలను నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తున్న వేళ టీజేఏసీ స్వరం పెంచింది. అందులో భాగంగానే కోదండరాం ప్రభుత్వ పనితీరుపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల నుంచి లక్ష ఉద్యోగాల వరకు టీఆర్ఎస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు.

ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. అందుకే ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎంచుకున్న ఆయుధాన్నే ఎంచుకుంది. కోదండరాంను కాంగ్రెస్ ఏజెంట్ గా చిత్రీకరిస్తోంది.

కానీ, ఆయన ఎవరు ఏజెంట్ అనేది తెలంగాణ ప్రజలకు తెలియదా...?