కేసిఆర్ కు కోదండరాం భారీ షాక్ ఇచ్చేనా?

Kodandaram to give unexpected shock to telangana chief minister KCR
Highlights

  • పోలీసుల ఓవర్ యాక్షన్ పై ఆధారాల సేకరణలో జెఎసి
  • కోర్టు ధిక్కరణపై న్యాయ పోరాటం చేసే యోచన
  • కొలువుల కొట్లాటపై డాక్యుమెంటరీ రూకల్పన
  • జాతీయ స్థాయిలో సర్కారు నిరంకుశత్వాన్ని ఎండగట్టే యోచన

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి సిసలైన ప్రతిపక్షం ఎవరయ్యా అంటే అందరూ చెప్పే పేరు జెఎసి నే. ఎందుకంటే తెలంగాణ సర్కారుకు కాక పుట్టిస్తున్నది జెఎసి మాత్రమే. రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ సవాలక్ష కారణాల వల్ల టిఆర్ఎస్ దూకుడును ఎదుర్కోవడం పక్కనపెడితే దరి దాపుల్లోకి కూడా చేరుకోలేని దుస్థితిలో ఉన్నాయి. కానీ జెఎసి మాత్రం సర్కారు కుతిక పట్టిన పరిస్థితులు నెలకొన్నాయి.

మొన్నటికి మొన్న జరిపిన కొలువుల కొట్లాట కేసిఆర్ సర్కారు దృష్టిలో చిన్న సభే కావొచ్చు.. కానీ కాక మాత్రం బాగానే తగిలింది. మీటింగ్ పెడితే పట్టుమని 500 మంది రారు.. నువ్వు ఒక జెఎసి ఛైర్మన్ వా అని గతంలో కోదండరాం గురించి సిఎం కేసిఆర్ అవమానపరిచేలా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వాడు, వీడు, లంగా రాజకీయం అంటూ తిట్ల దండకం కూడా అందుకున్నారు సిఎం. మరి జెఎసి జరిపిన కొలువులకై కొట్లాట సభకు 20వేల మంది వచ్చారని జెఎసి నేతలు చెబుతున్నారు. తీవ్ర నిర్బంధాలను సైతం అధిగమించి అంతమంది వచ్చారంటే ఈ సర్కారు వెన్నులో వనుకు మొదలైంది కదా అని జెఎసి నేత ఒకరు ప్రశ్నించారు. నిర్బంధం పెట్టకపోతే మరో 40వేల మంది వరకు జెఎసి సభకు హాజరయ్యే అవకాశాలుండేవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కొలువుల కొట్లాట సభ ద్వారా గట్టి షాక్ ఇచ్చామన్నారు. అయితే అసలు సిసలైన భారీ షాక్ మరోటి ఇచ్చేందుకు జెఎసి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జెఎసి చేపట్టిన కొలువులకై కొట్లాట సభను ఎప్పటినుంచో సర్కారు జరగనీయకుండా అడ్డుపుల్లలు వేస్తూ వస్తున్నది. కానీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని సభ జరిపారు జెఎసి నేతలు. కొట్లాట సభ విషయంలో సర్కారుకు హైకోర్టు చివాట్లు పెట్టింది. జెఎసి వాళ్లు అడిగిన 48 గంటల్లో సభకు అనుమతివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సభకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేశారని జెఎసి ఆగ్రహంగా ఉంది. దీంతో మరోమారు తెలంగాణ సర్కారు మీద హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసే యోచనలో ఉంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల జెఎసిలను ఛైర్మన్ కోదండరాం పురమాయించారు.

ఎక్కడెక్కడ అరెస్టులు చేశారు? ఎక్కడెక్కడ బైండోవర్లు చేశారు. ఎక్కడ నిర్బంధించారు? వాటి తాలూకు వీడియోలు, ఫొటోలు అన్నింటినీ సేకరిస్తున్నారు. వీటన్నింటినీ సేకరించి న్యాయపోరాటానికి దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది జెఎసి.

 

అర్థరాత్రి యాక్షన్ పై ఆగ్రహం

తెలంగాణ పోలీసులు కొలువులకై కొట్లాట సభ అనగా అర్థరాత్రి ఒంటిగంట నుంచి రంగంలోకి దిగి జెఎసి నేతల అరెస్టుల పర్వం కొనసాగించారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా జెఎసి సభకు నిరుద్యోగులు, విద్యార్థులు హాజరయ్యేందుకు వీలుగా అన్ని జిల్లాల నుంచి ఆర్టీసి బస్సులను బుక్ చేసుకున్నారు. ఆ బస్సులకు అడ్వాన్స్ కూడా చెల్లించారు. కానీ సరిగ్గా రాత్రి ఒంటిగంటకు ఆర్టీసి బస్సులన్నీ క్యాన్సల్ చేస్తున్నట్లు ఆర్టీసి నుంచి తమకు సమాచారం పంపారని జెఎసి నేతలు చెబుతున్నారు. అలాగే ప్రయివేటు బస్సులను బుక్ చేసుకోగా వారిని కూడా వత్తిడి చేసి బెదిరించి బస్సులను రాకుండా అడ్డుకున్నారని చెబుతున్నారు. ఈ విషయమై కోర్టులో చాలెంజ్ చేసి సర్కారు తీరును ఎండగట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

 

కొలువులకై కొట్లాటపై డాక్యుమెంటరీ

కొలువులకై కొట్లాట సభ పూర్వాపరాలపై తెలంగాణ జెఎసి ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించే యోచనలో ఉంది. ఆ సభ కోసం ఎంత కష్టపడ్డారు? పోలీసుల నిర్బంధం ప్రభుత్వ నిరంకుశ తీరును ఆ డాక్యుమెంటరీలో పొందుపరిచే యోచనలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొదించిన తర్వాత ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలకు అందజేసే యోచనలో ఉన్నారు. తెలంగాణ సర్కారు దేశంలోనే మేము నెంబర్ 1 అని చెప్పుకుంటున్న తరుణంలో తెలంగాణలో నిరుద్యోగుల పట్ల సర్కారు ఉక్కుపాదం మోపుతున్న తీరును దేశానికి చాటేలా డాక్యుమెంటరీ సీడీలను అన్ని రాజకీయ పార్టీలకు, ప్రముఖ నేతలకు పంపనున్నట్లు తెలిసింది.

మొత్తానికి తెలంగాణలో తమకు ఎదురే లేదన్నట్లు ధీమాతో ఉన్న పాలకులకు గట్టి ఝలక్ ఇచ్చామని జెఎసి నేతలు చెబుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసు ద్వారా మరో షాక్ ఇస్తామని దానికోసం ఆధారాలు సేకరిస్తున్నామని చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న నిరంకుశ పాలనను దేశానికి చాటి చెబుతామంటున్నారు.

loader